ఏపీ డిప్యూటీ సిఎంగా ఒకపక్క విపరీతమైన బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు జనసేన వ్యవహారాలతోనూ టైం లేనంతగా సతమతమవుతున్నారు. వ్యక్తిగత జీవితం గురించి గతంలోలా సోషల్ మీడియా అతి చేయకపోవడం అభిమానులు రిలీఫ్ ఫీలవుతున్నారు. అయితే పొలిటికల్ లైఫ్ సంగతి ఎలా ఉన్నా పవన్ తరచు సినిమాలు చేయాలనేది ఫ్యాన్స్ డిమాండే కాదు సగటు మూవీ లవర్స్ కోరిక కూడా. అందుకే ఏదైనా అనౌన్స్ మెంట్ వస్తే చాలు అందరిలోనూ ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజుకి ఫోన్ చేసి త్వరగా పూర్తయ్యేలా ఏదైనా సినిమా ప్లాన్ చేయమని పురమాయించారట. నెలకు పది నుంచి పదిహేను రోజులు కాల్ షీట్స్ తో నాలుగు నెలల్లో కంప్లీట్ అయ్యేలా ఏదైనా సబ్జెక్టు ఉంటే దర్శకుడితో వచ్చి కలవమని పురమాయించినట్టు తెలిసింది. ఇది అధికారికంగా ప్రకటించలేదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ విశ్వసనీయంగా ఉంది. గతంలో ఈ కాంబోతో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రామాయణ సక్సెస్ మీట్ లో కూడా దిల్ రాజు పవన్ తో మరో సినిమా తీసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.
స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. పవన్ కళ్యాణ్ చేతిలో ఓజి 2 ఉంది. ఇదింకా షూటింగ్ మొదలుకాలేదు. నాని బ్లడీ రోమియో పూర్తి చేసుకుని వచ్చాక దర్శకుడు సుజిత్ దీన్ని పట్టాలు ఎక్కించాలి. ఇంకోవైపు కేవలం రెండున్నర సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి పరిస్థితి చాలా టఫ్ గా ఉంటుంది. దానికి ఆరు నెలల ముందే పవన్ సినిమా ప్రపంచనికి దూరంగా ఉండే అవసరం వస్తుంది. ఆలోగానే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే తప్ప టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
ఇది కాకుండా రామ్ తాళ్ళూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయాల్సిన మూవీ మరొకటి ఉంది. మూడు సంవత్సరాలుగా దీని గురించి వినడం, ఆఫీస్ ఓపెనింగ్ ఫోటో చూడటం తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఈ అయోమయం అంత సులభంగా తీరేలా లేదు. దిల్ రాజు కనక నిజంగా కాల్ అందుకుని ఉంటే మటుకు కథ, దర్శకుడిని సెట్ చేసుకోవడం పెద్ద పని కాదు. కాకపోతే రీమేక్ కాకుండా ఓజిలాగా ఒరిజినల్ కంటెంట్ చేయాలనేది అభిమానుల డిమాండ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates
