పాతికేళ్ల వివాదాన్ని వదిలిపెట్టని కమల్

కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్ డ్రామాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇవాళ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. క్యాస్టింగ్ తదితర పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ సండియార్ వెనుక 23 సంవత్సరాల వెనుక జరిగిన ఒక వివాదం ఉందంటే ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. అది తెలియాలంటే పాతికేళ్ళు వెనక్కు వెళ్ళాలి.

2003 ఏప్రిల్ నెలలో కమల్ హాసన్ సండియార్ అనే మూవీ ప్రకటించి ఘనంగా లాంచ్ చేశారు. పుదియ తమిళగమ్ నేత డాక్టర్ కృష్ణస్వామి దీని మీద తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. దేవర్ వర్గాల మనోభావాలను దెబ్బ తీయడంతో పాటు వర్గ కక్షలను ప్రేరేపించే విధంగా టైటిల్ ఉందంటూ పెద్ద ఎత్తున నిరసనలకు తెర తీశారు. దీంతో కమల్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితని రక్షణ కోరితే ఆవిడ నిరాకరించారు. దీంతో విరుమాండిగా టైటిల్ మార్చి రిలీజ్ చేశారు. తెలుగులో పోతురాజుగా వచ్చింది.

తర్వాత అందరూ ఈ కాంట్రావర్సీని మర్చిపోయినా కమల్ హాసన్ మర్చిపోలేదు. రెండున్నర దశాబ్దాల తర్వాత సండియార్ ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే అప్పట్లానే ఇప్పుడూ వివాదాలు వస్తాయా అంటే ఏమో చెప్పలేం. ప్రభుత్వం సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే కమల్ హాసన్ గతంలో కాంగ్రెస్ మద్దతుదారు. డిఎంకెతో పొత్తు చెడిపోయినా రాహుల్ గాంధీతో కమల్ స్నేహం బ్రేక్ అయ్యుండదు. విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది. సో గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో రూట్ క్లియర్ గానే ఉంది.

ఏమైనా కమల్ మాత్రం అసాధ్యులే. తాను ఎంతో ఇష్టపడి పెట్టుకున్న పేరుని అప్పట్లో బ్యాన్ చేసినా పట్టు వదలకుండా, మర్చిపోకుండా ఇప్పుడు కూడా దాన్ని వాడుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇది బాగానే ఉంది కానీ రజనీకాంత్ కలయికలో కమల్ హాసన్ చేయబోయే మల్టీస్టారర్ గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. జైలర్ 2 బ్లాక్ బస్టర్ అయ్యాక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పనితనం అర్థమైపోవడంతో ఈ ప్రాజెక్టుని తెరకెక్కిస్తారని చెన్నై మీడియా వర్గాల ఇన్ సైడ్ టాక్.