పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అదొక సంచలనమే. ముఖ్యంగా తన ఇంటర్వ్యూల్లో ఏదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన వస్తుంటుంది. కొన్నిసార్లు పవన్ గురించి పాజిటివ్ కామెంట్లు చేసే ఆమె.. కొన్నిసార్లు విమర్శలు చేస్తుంటుంది. తన విషయంలో అతిగా స్పందించే పవన్ కళ్యాణ్ అభిమానుల మీద ఆమె తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె అదే ధోరణిలా కామెంట్స్ చేశారు.
పవన్ నుంచి తాను విడాకులు తీసుకుని 14 ఏళ్లు అవుతోందని.. ఐతే ఇప్పటికీ తనకు సొంత గుర్తింపును ఇవ్వకుండా, పవన్ మాజీ భార్యగానే చూడడాన్ని ఆమె తప్పుబట్టారు. “తెలుగువాళ్లందరికీ ఒక విషయం చెప్పాలి. బద్రి సినిమాతోనే నా జీవితం మొదలైందని అనుకుంటారు. కానీ అంతకుముందు నాకు జీవితం లేనట్లుగా చూస్తే ఎలా? మాకు విడాకులు వచ్చి 14 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు. కానీ నా వనవాసం ముగుస్తుందో తెలియట్లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
బద్రి చేయడానికి ముందే కాదు.. పవన్ నుంచి విడిపోయాక కూడా తాను విజయాలు సాధించానని రేణు చెప్పింది. 2012లో విడాకులు తీసుకున్నాక తాను మరాఠీ సినిమాను ప్రొడ్యూస్ చేస్తే అది హిట్టయిందని.. అలాగే ఇంకో సినిమాకు కథ రాసి, డైరెక్ట్ చేశానని రేణు దేశాయ్ గుర్తు చేసింది. అలాగే తాను డ్యాన్స్ షోలకు కూడా పని చేశానని.. కవితలు రాశానని.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నానని తనకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయని రేణు ప్రశ్నించింది. తాను కుక్కను కాపాడినా, తిడుతున్నారని.. పవన్ కళ్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లు మాట్లాడతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates