సినీ ప్రియులు చూడాలని బలంగా కోరుకునే కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటిదాకా ఒకే సినిమా వచ్చింది. 1979లో రిలీజైన కె బాలచందర్ ఇది కథ కాదు తర్వాత మళ్ళీ ఆ కలయిక సాధ్యం కాలేదు. చాలాసార్లు ఎన్నో వేడుకల్లో కలుసుకోవడం లాంటివి జరిగాయి కానీ స్క్రీన్ పంచుకోవడం మూవీ లవర్స్ చూడలేకపోయారు. ఇప్పుడది బిగ్ స్క్రీన్ కోసం కాకపోయినా బుల్లితెర కోసం అతి త్వరలో జరగనుందని విశ్వసనీయ సమాచారం.
నెట్ ఫ్లిక్స్ తీస్తున్న మెగా వర్స్ టాక్ షోతో చిరంజీవి ఓటిటి ప్రపంచంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్రహ్మానందం- సునిల్-సత్యలతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఎపిసోడ్ నిన్న షూట్ చేశారు. చాలా బాగా వచ్చిందని టాక్ ఉంది. ముగ్గురు కలిసి చిరుతో పంచుకున్న విశేషాలతో పాటు బయట తెలియని ఎన్నో విషయాలు ఈ షో ద్వారా బయట పడబోతున్నాయని టాక్. తాజాగా కమల్ హాసన్ తో ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్ రేపు తీస్తారని ఫిలిం నగర్ టాక్.
ఇదే జరిగితే ఇద్దరు లెజెండ్స్ పంచుకునే అరుదైన ముచ్చట్లు తనివితీరా చూసుకోవచ్చు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ చిరంజీవి తెలుగుకు కట్టుబడి అక్కడే ఉన్నారని, ఒకవేళ తమిళనాడుకు వచ్చి ఉంటే ఇక్కడా సక్సెస్ అయ్యేవారని మెచ్చుకున్న వీడియో ఆ మధ్య వైరల్ అయ్యింది. చిరు సైతం కమల్ అంకిత భావం గురించి స్వాతిముత్యం, స్నేహం కోసం మొదలైన వంద రోజుల వేడుకల్లో చాలా గొప్పగా చెప్పుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
బిగ్ బాస్ తర్వాత కమల్ మళ్ళీ చిన్నతెరవైపు రాలేదు. ఇప్పుడు చిరంజీవి కోసం వచ్చేది నిజమే అయితే మటుకు ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్, జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా, సమంత సామ్ జామ్, దగ్గుబాటి రానా నెంబర్ వన్ యారీ మొదలైనవి విజయవంతంగా వర్కౌటయ్యాయి. మరి చిరంజీవి మెగావర్స్ వీటికి భిన్నంగా ఎలా ఉంటుందనేది స్ట్రీమింగ్ అయ్యాక తెలుస్తుంది. మొత్తం పదిహేను ఎపిసోడ్లు ఫస్ట్ సీజన్ లో ఉంటాయని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates