టాలీవుడ్ లో ఇప్పుడో టాపిక్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పెద్ద హీరోల సినిమాలు పదే పడే వాయిదా వేసుకోవడం వల్ల ఇతర చిన్న చిత్రాలకు మంచి డేట్లు మిస్సైపోతూ, అటు ఓటిటి, ఇటు థియేటర్ రెండు రకాలుగా రెవిన్యూ నష్టపోతున్న వైనం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఒకటి రెండు కాదు నాలుగైదు తేదీలు మార్చుకోవడం వల్ల ఇతరులు ఎదురుకుంటున్న సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ చొరవ తీసుకుని దీన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదు.
పెట్రోల్, గోల్డ్ బులియన్ లాగా ఇది డిమాండ్, నియంత్రణ ఆధారంగా జరిగే బిజినెస్ కాదు కాబట్టి సినిమా వ్యవహారాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఒక పరిమిత పరిధి వరకే ఉంటుంది. సెన్సార్, టికెట్ రేట్లు, వసతులు మించి మిగిలిన విషయాల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. ఆ హక్కు కూడా లేదు. ఏదైనా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు చొరవ తీసుకుని పరిష్కరించాలి తప్పించి అంతకు మించి వేరే ఏ సొల్యూషన్ కనిపిస్తే ఒట్టు. ఇక్కడ పెద్ద నిర్మాతలు పెద్ద మనసు చేసుకుంటే బాగుంటుంది.
ఎలా అంటే ఉదాహరణకు ఒక ప్యాన్ ఇండియా మూవీ ఫలానా డేట్ కు వస్తుందని అనౌన్స్ మెంట్ ఇస్తుంది. దాని తర్వాత వారం రెండు వారాల గ్యాప్ తర్వాత ఇంకో చిన్న సినిమా సదరు నిర్మాత ప్లాన్ చేసుకుంటాడు. తీరా చూస్తే ప్యానిండియా వాయిదా పడి సరిగ్గా ఈ చోటా సినిమా మీద పడుతుంది. దీంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. థియేటర్ అగ్రిమెంట్లు, ప్రమోషన్ కోసం కేటాయించిన బడ్జెట్లు, పబ్లిసిటీ ఖర్చు మళ్ళీ సున్నా నుంచి మొదలుపెట్టుకుని చేయాలి.
ఇలా కాకుండా వాయిదా తప్పదని ఫిక్సైనప్పుడు కొత్త డేట్ లో ఏమేం కొత్త సినిమాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. ఇది వ్యాపారం ఎవడి సరుకు వాడు అమ్ముకుంటాడని కొందరు అనవచ్చు కానీ పరస్పర సహకారం అవసరమైన చోట అది రెండు వైపులా ఉండాలి. ఇక్కడ ఎవరి పేర్ల ప్రస్తావన అవసరం లేదు. అందరూ దీనికి బాద్యులే. ఎటొచ్చి సొల్యూషన్ చెప్పేవాళ్ళే ఉండరు. ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది కాబట్టి ఎవరినీ వేలెత్తి చూపించే సిచువేషన్ లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates