విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర లేదు.. పండించని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన అద్భుత అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత రెండు దశాబ్దాల్లో సరైన సినిమాలు చేయగా.. చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటూ కొత్తతరానికి చేరువ కాలేకపోయారు కానీ.. ముందు తరాల వాళ్లకు మోహన్ బాబు ఎంత గొప్ప నటుడో బాగా తెలుసు.

ఇప్పటికీ సరైన పాత్ర రాసి, దాన్ని తెరపై సరిగా ప్రెజెంట్ చేయగలిగితే మోహన్ బాబు విశ్వరూపం చూపిస్తాడనడంలో సందేహం లేదు. అలాంటి పాత్ర కోసమే ఆయన అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ‘యమదొంగ’ తర్వాత మోహన్ బాబు తన మార్కును చూపించే సినిమా ఏదీ చేయలేదన్నది వాస్తవం.

ఐతే నాని లాంటి మంచి అభిరుచి ఉన్న హీరో ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల లాంటి ఈ తరం దర్శకుడు రూపొందించిన ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబును విలన్ పాత్రకు ఎంచుకోవడంతో ఆయన అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. శిఖంజ మాలిక్ పాత్ర లుక్ చూస్తేనే క్రేజీగా అనిపించింది. ఐతే అంతకుమించి ఆ పాత్రకు సంబంధించి ఏ విశేషాలనూ పంచుకోలేదు టీం. ఈ సినిమా టీజర్లోనూ ఆయనకు స్కోప్ లేకపోయింది. ట్రైలర్లో మోహన్ బాబు పాత్ర, డైలాగులు ఎలా ఉంటాయా అని ఫ్యాన్స్ ఎదురు చూడగా.. ట్రైలరే లేకుండానే సినిమా రిలీజ్ చేయబోతున్నారు.

ఇది మోహన్ బాబు అభిమానులకు ఒకింత నిరాశ కలిగించే విషయమే అయినా.. అదీ ఒక రకంగా మంచికే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాత్ర గురించి ఏ హింట్ ఇవ్వకుండా నేరుగా థియేటర్లో సర్ప్రైజ్‌ చేయబోతున్నారన్నమాట. ఇది ఆయన పాత్రను మరింత క్యూరియస్‌గా మారుస్తుందనడంలో సందేహం లేదు.

శ్రీకాంత్ ఓదెల పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ‘దసరా’లోనే చూశాం. ముఖ్యంగా అందులో విలన్ పాత్ర భలేగా పండింది. అదే రేంజిలో శిఖంజ మాలిక్ పాత్ర ఉంటే మాత్రం మోహన్ బాబు విశ్వరూపాన్ని చూడబోతున్నట్లే. ఆయన పాత్ర, పెర్ఫామెన్స్ పండాయంటే సినిమాకు అవి పెద్ద అసెట్ అవడం ఖాయం.