సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరని ఈ మధ్య ఆయన నిర్మించిన రోమాంచకం సినిమా రిలీజ్ దగ్గర్నుంచి మీడియా వాళ్లకు అర్థమవుతోంది. స్టేజ్ మీద, మీడియా ఇంటర్వ్యూల్లో ప్రణయ్ మాట్లాడేటపుడు.. సందీప్ రెడ్డిలో చూసే కాన్ఫిడెన్సే కనిపిస్తోంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మీడియా వాళ్లకు సవాల్ విసిరాడు.
తమ ప్రొడక్షన్లో వచ్చిన రోమాంచకం చిన్న సినిమా కాబట్టి దాన్ని కొందరు టార్గెట్ చేశారని.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ఏవేవో కామెంట్లు చేశారని.. రేప్పొద్దున స్పిరిట్ సినిమా వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం అని ఆయన అన్నారు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా అని యాంకర్ అడిగితే.. అవునన్నట్లు మాట్లాడిన ప్రణయ్, స్పిరిట్ విషయంలో తాము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, దాని మీద నెగెటివ్ చేసి ఏమైనా ప్రభావం చూపించగలరేమో చూద్దాం అని అన్నాడు.
స్పిరిట్ విషయంలో ప్రణయ్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండడం, సవాలు కూడా చేయడంతో ప్రభాస్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అన్నదగ్గర్నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అవి అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి ఒక ఫస్ట్ లుక్ తప్ప ఏమీ రిలీజ్ కాలేదు. వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు ఉండడంతో కచ్చితంగా టీజర్ వస్తుందనే అంచనాతో ఉన్నారు ఫ్యాన్స్.
ఆ టీజర్ రిలీజై అంచనాలకు తగ్గట్లు ఉంటే.. అందులో సందీప్ మార్కు కనిపిస్తే మాత్రం దీని హైప్ ఇంకో లెవెల్‌కు చేరడం ఖాయం. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చిలో విడుదల కావాలి. కానీ ఫౌజి సినిమా వాయిదా పడేలా ఉండడంతో ఈ సినిమాకు కూడా డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates