ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు బెస్ట్ ట్రైలర్ కట్ చేయాలంటే ఒక టీమ్ మొత్తం దాని మీదే పని చేయాలి. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కనీసం నాలుగు రోజులు బ్లాక్ అయిపోతారు. దీని వల్ల ఇతర పనులు చూసుకోవడం కష్టం. ఇంత హై ప్రెజర్ లో ప్రతి నిమిషం విలువైనదే. ఇంకా చెప్పాలంటే ప్రెస్ మీట్ కోసం ఖర్చు పెట్టిన కాలం కూడా ముళ్ళ మీద కూచున్నట్టే.

ఇలా ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్ అనేది చూసుకుంటే ప్యారడైజ్ వరకు ఎలాంటి రిస్క్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ట్రైలర్ కనక ఏ మాత్రం అటుఇటు అయినా దాని ప్రభావం ఓపెనింగ్ మీద పడుతుంది. పెద్ది విషయంలో జరిగిన డ్యామేజ్ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే ప్యారడైజ్ టీమ్ చాలా తెలివిగా వ్యవహరించి పూర్తిగా డ్రాప్ అయిపోయింది. అలాని అంతా పాజిటివ్ గా చెప్పుకోలేం.

ఇంకో కోణంలో వేరే రిస్క్ ఉంది. సినిమా ఏదైనా దాని గురించి ప్రాధమిక అవగాహన ఇచ్చేది ట్రైలరే. దాన్ని బట్టే చాలా మంది ప్రేక్షకులు మొదటి రోజు లేదా మొదటి వారం చూడాలా వద్దానేది నిర్ణయించుకుంటారు. ఒకవేళ నిర్మాత కనక టికెట్ రేట్ల పెంపుకు వెళ్తే ఏముందో పూర్తిగా తెలియకుండా వెళ్లాలా వద్దానే కన్ఫ్యూజన్ లో న్యూట్రల్ ఆడియన్స్ పడిపోవచ్చు. ఇది ఎంత శాతం ఉంటుందనేది చెప్పలేం. ఒకవేళ హైక్స్ తీసుకోకపోతే మటుకు ఆకాశమే హద్దుగా కలెక్షన్లు కురుస్తాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఇంకా ఎలాంటి ప్లానింగ్ జరగలేదని నాని చెబుతున్నాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తుతున్న టైంలో వేడుకలకు సమయం సరిపోదు. అందుకే ప్యాన్ ఇండియా మాటని కూడా నాని పక్కన పెట్టేస్తున్నాడు. ఆ పదం వాడొద్దని, తమ టార్గెట్ తెలుగని కుండ బద్దలు కొట్టేస్తున్నాడు. ప్రాక్టికల్ థింకింగ్ అంటే ఇది. ట్రైలర్ లేకపోవడం ఫ్యాన్స్ కు కొంత నిరాశ కలిగించేదే అయినా కంటెంట్ మొత్తాన్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే మజా వేరే లెవెల్ ఉంటుందిగా.