చల్లని కబురు త్వరగా చెబితే మేలు

ది ప్యారడైజ్ రాక గురించి అనుమానాలు, ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 24 రావాలని టీమ్ రేయింబవళ్లు కష్టపడుతూ వాయిదా అవసరం లేకుండా వీలైనంతగా కృషి చేస్తోంది. ఇంకోవైపు అక్టోబర్ మొదటి వారం లేదా తొమ్మిదో తేదీకి వెళ్ళక తప్పదనే గాసిప్స్ ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని మౌనంగానే ఉన్నారు. యుఎస్ నుంచి వచ్చిన న్యాచురల్ స్టార్ ప్రస్తుతం ఈ చర్చలోనే బిజీ బిజీ.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఒక పాట, కొంచెం ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ ఉంది. అనిరుధ్ రవిచందర్ రీ రికార్డింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాడట. కానీ ఫైనల్ కాపీ చేతికి ఇవ్వాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే సెప్టెంబర్ చివరి వారం నుంచి అనిరుద్ జైలర్ 2 పనుల్లో బిజీ అయిపోతాడు. ఇంకా దాని ట్రైలర్ కట్ కూడా రెడీ కాలేదు. ప్యారడైజ్, జైలర్ 2 మధ్య ఉన్న గ్యాప్ కేవలం ఇరవై రోజులే. సో తన మీద ఒత్తిడి ఆషామాషీగా ఉండదు. క్వాలిటీ ఇవ్వాలంటే స్పేస్ ఉండాలి.

ఇన్ని ప్రెజర్ల మధ్య ప్యారడైజ్ ఏం చేస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 24 డేట్ లో ఎలాంటి మార్పు లేదు. ఆరు నూరైనా వచ్చి తీరాలని చూస్తున్నారు. నిర్మాత నాగవంశీ తన ఆదర్శ కుటుంబంని అక్టోబర్ 2 నుంచి తప్పించే ఉద్దేశంలో లేరు. జైలర్ 2 తెలుగు హక్కుల కోసం ఆయనే ట్రై చేస్తున్న నేపథ్యంలో తన మీద తనే పోటీ పెట్టుకోరనేది వాస్తవం. ఒకవేళ నాని కూడా అక్టోబర్ మొదటి వారమే అంటే అందరూ ఇబ్బందుల్లో పడతారు.

ఇదంతా తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టేలా ఉంది. ఇంత సమస్య ఉంది కాబట్టి ప్యారడైజ్ మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలనేది తేల్చుకోలేకపోతున్నారు. ట్రైలర్ లాంచ్ కూడా ఫిక్స్ కాలేదు. ప్రమోషన్లకు ఎక్కువ సమయం లేదు. రెండున్నర వారాల్లో బజ్ పెంచాలంటే అద్భుతాలు చేయాలి. ఇప్పుడున్న హైప్ ప్రకారం చూసుకుంటే భీకర ఓపెనింగ్స్ వస్తాయి కానీ ప్యాన్ ఇండియా భాషల్లో కూడా రెస్పాన్స్ తెచ్చుకోవాలంటే ప్రచార పర్వాన్ని వీలైనంత పీక్స్ కు తీసుకెళ్లాలి.