మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చూపించిన కోపం, బాడీ లాంగ్వేజ్ అప్పట్లోనే బాగా హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత చాలా పాత్రలు చేసినా, ఇటీవల ‘సలార్’లో రాధారమగా మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించింది. ఇప్పుడు ఏకంగా ‘మహాకాళి’లో టైటిల్ పాత్రలో కనిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న ‘మహాకాళి’ టీజర్‌ ఇవాళ రిలీజ్ అయ్యింది. ఇక అందులో శ్రియా రెడ్డి లుక్ కూడా గట్టిగానే పడింది. డార్క్ మేకప్, ఎర్రటి కళ్ళు, భారీ ఆభరణాలు, పుర్రెల అలంకరణ, చేతుల్లో ఆయుధాలతో పూర్తి రౌద్ర రూపంలో చూపించారు. పసి పాపను ఒడిలో పెట్టుకున్న రూపం, ఆ తర్వాత చేతులతో మహాకాళిగా కనిపించే షాట్ కూడా బాగుంది. టీజర్‌లో ఎన్ని ఉన్నా ఆ పాత్ర మీదకే ఫోకస్ వెళ్లిపోయింది.

ఆమె ఎక్కువగా అరవకుండానే ముఖంతో సీన్‌ను హోల్డ్ చేయగలదు. ఆమె వాయిస్ కూడా గట్టి పాత్రలకు అదనపు బలం. ఇప్పుడు మహాకాళి పాత్రలో ఇవన్నీ ఉపయోగించుకునే స్కోప్ ఇంకా ఎక్కువగా ఉంటుంది..పైగా ఇది సాధారణ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కాదు. మహాకాళి పేరు వినగానే ప్రేక్షకుడికి ఒక రౌద్ర రూపం ముందే ఉంటుంది. దాన్ని తెరపై చూపించేటప్పుడు జస్ట్ మంచి వీఎఫ్‌ఎక్స్, మేకప్ ఉంటే సరిపోదు. 

ఆ రూపంలో కనిపించే నటిని చూసినప్పుడు కూడా అదే పవర్ అనిపించాలి. టీజర్ వరకు చూస్తే శ్రియా రెడ్డి ఆ విషయంలో మంచి ఛాయిస్ అనిపించింది. మరోవైపు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపిస్తున్నాడు. ఆయన పాత్రను కూడా చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు టీజర్ చెబుతోంది. అలాంటి క్యారెక్టర్‌కు ఎదురుగా వచ్చే మహాకాళి పాత్ర అంతకంటే బలంగా ఉండాల్సిందే. ఇక సినిమాలో ఈ ఒక్క పాత్రను ఎంత బాగా హైలెట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. కథలో బలంగా వాడితే శ్రియా రెడ్డి కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్ర కావచ్చు. అలాగే సినిమాకు కూడా ఇదే పాత్ర అసలు బలం అవుతుందేమో చూడాలి.