ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడ్డారు.. తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగా అలరించారు.. ఎంత గొప్ప సినిమాలు చేశారు.. ఒకప్పుడు ఆయన ఎలాంటి స్టార్ డమ్ అనుభవించారు.. యువ కథానాయకుల హవాను కూడా తట్టుకుని ఇంకా టాప్ స్టార్లలో ఒకరిగా ఎలా కొనసాగగలుతున్నారు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరూ ఆయన గొప్పల్ని చెప్పాల్సిన పని లేదు. ఆయన ఘనతలను కీర్తించాల్సిన అవసరం లేదు.
కానీ చిరు ఘనతల గురించి గొప్పగా చెప్పే క్రమంలో, ఆయన్ని పొగిడే క్రమంలో కొందరు హద్దులు దాటిపోతుండడం.. వేరే వాళ్లను కించపరిచే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. కొందరు సినీ జర్నలిస్టులు సమయం సందర్భం లేకుండా చిరును పొగడ్డం.. ఆయన చేసిన పేలవమైన సినిమాలకు కూడా ఎలివేషన్లు ఇవ్వడం ద్వారా మెగాస్టార్ మీద అనవసరంగా వ్యతిరేకత వచ్చేలా, ట్రోల్స్ పడేలా చేస్తుండడం మీద ఇప్పటికే చర్చ జరుగుతోంది.
అలాగే వేరే సినీ కుటుంబాలకు చెందిన లెజెండ్స్‌ను మెగా అభిమానుల్లో ఒక వర్గం అదే పనిగా ట్రోల్స్ వేస్తూ కించపరచడం వల్ల.. అవతలి ఫ్యాన్ డమ్స్‌కు చిరు టార్గెట్ అయిపోవడం కూడా ఇటీవల తరచుగా జరుగుతోంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. ఏటా చిరు బర్త్‌డేకు ముందు రోజు జరిగే ఈవెంట్ ఒక ప్రహసనంగా మారుతుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడికి వచ్చే అతిథులు మామూలుగా చిరు గొప్పదనాన్ని చెప్పి, ఆయనతో తమకున్న అనుభవాలు, అనుబంధం గురించి చెప్పి ఊరుకోవచ్చు కదా? అలా చేయడం లేదు. చిరును పొగడ్డంలో తామే టాప్ అని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టూమచ్‌గా అనిపించే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇటీవలి ఈవెంట్ సంగతే తీసుకుంటే.. బండ్ల గణేష్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వివాదాస్పదం అయింది.
ఒక సూపర్ స్టార్ కడుపున ఒక సూపర్ స్టార్ పుట్టడం చిరుకే జరిగిందని.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ ఈ అదృష్టం లేదని అన్నారు. మరి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ.. ఏఎన్నార్ కొడుకు నాగార్జున.. కృష్ణ కుమారుడు మహేష్ బాబు సూపర్ స్టార్లు కాలేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆయా అభిమానుల నుంచి ఇది వ్యతిరేకత తెచ్చిపెడుతుంది కదా?
ఇక హైపర్ ఆది విషయానికి వస్తే సచిన్ టెండుల్కర్ రికార్డులన్నీ బద్దలైపోయాయని.. కానీ చిరు రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేదని అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా టూమచ్‌గానే అనిపిస్తోంది అందరికీ. ఇంకా ఆది కొన్ని అతియోశక్తి మాటలు మాట్లాడాడు.
మరోవైపు ఎవరో జూనియర్ పవర్ స్టార్ అంటూ ఒక వ్యక్తిని స్టేజ్ ఎక్కిస్తే అతను ఊరికే ఊగిపోతూ అవసరం లేని పొలిటికల్ డైలాగులు చెప్పి, వార్నింగులు ఇచ్చి వైసీపీ వాళ్లను రెచ్చగొట్టాడు. ఇది కూడా పూర్తిగా అనవసరం. ఇక ఈ ఈవెంట్లో చాలామంది చిరంజీవి తొక్కేస్తాడు అంటూ సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ మీద స్పందించారు. ఎవరో కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ నెగెటివ్ ట్రెండ్ వీళ్ల స్పందనతో మరింత పాపులర్ అవ్వడం గమనార్హం.
బర్త్‌డే వేడుకలు అంటే సింపుల్‌గా, హుందాగా.. చిరు లెగసీని సెలబ్రేట్ చేసేలా ప్రసంగాలు ఉండేలా చూసుకోవాలి. చిరు సినిమాలకు సంబంధించిన వీడియోలు ప్లే చేయడం, ఇంకేవైనా కార్యక్రమాలు చేయాలి. కానీ దీన్నో భజన కార్యక్రమంగా మార్చేయడం.. ఇలా వివాదాస్పదమైన ప్రసంగాలు చేయడం వల్ల చిరుకు డ్యామేజీ తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఎవరెస్ట్ శిఖరం లాంటి చిరుకు కొత్తగా ఇప్పుడు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన, ఎలివేషన్లు వేయాల్సిన అవసరం లేదని గుర్తించి.. ఇలాంటి వాటికి చెక్ పెడితే మంచిది. చిరు కూడా దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
This post was last modified on August 24, 2026 12:11 pm
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…