సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో ఏడాది కిందట పెద్ద వివాదం చెలరేగి, తర్వాత సద్దుమణిగింది. రెమ్యూనరేషన్, వర్క టైమింగ్స్ సహా పలు విషయాల్లో అలవికాని షరతులు పెట్టడం వల్లే దీపిక మీద వేటు పడిందంటూ ఆ టైంలో ఎక్కువమంది ఆమెనే తప్పుబడుతూ మాట్లాడారు. ఐతే ఒక వర్గం దీపికనూ సమర్థిస్తూ మాట్లాడింది.

సందీప్‌ను వ్యతిరేకించే బాలీవుడ్ మీడియా, అలాగే దీపిక పీఆర్ టీం.. సందీప్‌ మీద గట్టిగానే ఎటాక్ చేసింది. కొంత కాలానికి ఈ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. సందీప్ ‘స్పిరిట్’ పనుల్లో పడిపోయాడు. దీపిక.. కింగ్, రాకా చిత్రాల మీద ఫోకస్ పెట్టింది. దీంతో కాంట్రవర్శీ కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు ఈ గొడవ మళ్లీ రాజుకున్నట్లు కనిపిస్తోంది.

‘స్పిరిట్’ సహ నిర్మాత, సందీప్ తమ్ముడు ప్రణయ్ రెడ్డి వంగ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక పెట్టిన కండిషన్ల గురించి మాట్లాడాడు. దీపికను తప్పించడంపై మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అని చెబుతూ.. ఆమె ‘స్పిరిట్’ లాభాల్లో 10 శాతం వాటా అడిగిన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో ఇంకో రౌండ్ దీపిక మీద సోషల్ మీడియా ఎటాక్ మొదలైంది. మరి బలమైన పీఆర్ ఉన్న దీపిక ఊరుకుంటుందా? తన వర్గాన్ని రంగంలోకి దించింది.

ఒక బాలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్.. దీపికకు మద్దతుగా ఒక పోస్టు పెట్టింది. సినిమా లాభాల్లో 10 శాతం వాటా అడిగితే తప్పేంటి.. అక్కడికేదో సినిమా లాభాలన్నీ అడిగినట్లు, సందీప్ ఎస్టేట్‌ను రాసివ్వమని అడిగినట్లు గోల చేస్తున్నారేంటి.. హీరోలు ఇలాగే లాభాల్లో వాటా తీసుకుంటారు కదా, హీరోయిన్ అలా అడిగితే తప్పా.. ఇదేం పురుషాధిక్యత అంటూ ఆ పోస్టులో సదరు జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఈ పోస్టును దీపిక లైక్ చేయడం చూస్తే.. ఆమె పీఆర్ టీమే ఇలా పోస్టు పెట్టించిందని అర్థమవుతోంది. దీంతో మళ్లీ దీపిక, సందీప్ మధ్య గొడవ మళ్లీ రాజుకున్నట్లయింది. దీనిపై సందీప్ టీం కూడా రంగంలోకి దిగుతుందా.. ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేస్తుందా అన్నది చూడాలి.