జైలు క‌ష్టాలపై పెద‌వి విప్పిన స‌ల్మాన్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇప్పుడు వివాదాల‌కు దూరంగా, కొంచెం ప్ర‌శాంతంగా బ‌తుకుతున్నాడు కానీ.. ఒక‌ప్పుడు ఆయ‌న‌తో ముడిప‌డ్డ వివాదాలెన్నో. కృష్ణ‌జింక‌ల్ని వేటాడిన కేసు, కారుతో ఫుట్‌బాత్ మీద నిద్రిస్తున్న వారి మీదికి ఎక్కించిన కేసు, హీరోయిన్ల‌తో ఎఫైర్లు-బ్రేక‌ప్‌లు.. ఇలా స‌ల్మాన్ త‌ర‌చుగా వివాదాల్లో చిక్కుకునేవాడు. కృష్ణ జింక‌ల కేసు, కారు ప్ర‌మాదం కేసు చాలా ఏళ్ల పాటు అత‌ణ్ని వెంటాడాయి.

ఈ కేసుల్లో జైలు జీవితం కూడా గ‌డిపిన అనుభ‌వం ఉంది స‌ల్మాన్‌కు. త‌ర్వాత ఆ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డి స్వేచ్ఛా జీవి అయ్యాడు. ఆ కేసులు, జైలు జీవితం గురించి ఎప్పుడూ పెద్ద‌గా మాట్లాడ‌ని స‌ల్మాన్.. తాజాగా అమేజాన్ ప్రైమ్ షో అల‌యెన్స్‌లో జైలు అనుభ‌వాల గురించి ఓపెన్ అయ్యాడు. అల‌యెన్స్‌లో పాల్గొంటున్న త‌న త‌మ్ముడు సోహైల్ ఖాన్‌కు మ‌ద్ద‌తుగా ఆ షోకు వెళ్లిన స‌ల్మాన్.. జైల్లో గ‌డ్డు ప‌రిస్థితుల గురించి మాట్లాడాడు.

ఒక చిన్న గ‌ది లాంటి బ్యార‌క్‌లో ఏకంగా 50 నుంచి 70 మంది ఖైదీలు క‌లిసి ఉండేవార‌ని స‌ల్మాన్ చెప్పాడు. అంత‌మందికి క‌లిపి ఒకే ఒక్క ఇండియ‌న్ స్టైల్ టాయిలెట్ ఉండేద‌ని.. అది కూడా శుభ్రంగా ఉండేది కాద‌ని స‌ల్మాన్ చెప్పాడు. బాత్రూమ్ అంత‌టా బ‌ల్లులు తిరిగేవ‌ని కూడా చెప్పాడు. స‌ల్మాన్ లాంటి సెల‌బ్రెటీని ఉంచిన జైలు బ్యార‌క్ అంత ఘోరంగా ఉంటే.. సామాన్య ఖైదీల సంగ‌తి ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు.

ఒక‌ప్ప‌టితో పోలిస్తే జైళ్ల‌లో ప‌రిస్థితులు, వ‌స‌తులు, తిండి మెరుగుప‌డ్డ‌ప్ప‌టికీ.. ఇంకా బెట‌ర్ అవ్వాల‌ని అక్క‌డి ప‌రిస్థితుల‌పై అనుభవం ఉన్న వాళ్లు అంటుంటారు. ఇక స‌ల్మాన్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, తెలుగు నిర్మాత దిల్ రాజుల‌తో క‌లిసి ఒక సినిమా చేస్తున్నాడు. దీని కంటే ముందు స‌ల్మాన్ పూర్తి చేసిన మాతృభూమి చిత్రం విడుద‌ల కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతోంది.