తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి మహిళలా మారిపోయింది అన్నా. ఈ మధ్య ఆమె ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులోనే కనిపిస్తున్నారు. తిరుమలకు నడక మార్గంలో వెళ్లి తలనీలాలు కూడా సమర్పించుకుని తెలుగు వాళ్ల మనసులు గెలుచుకున్నారు అనా.
ఐతే 13 ఏళ్ల కిందటే పవన్‌ను పెళ్లాడి, ఆయన కుటుంబంలో కలిసిపోయిన అనాను ఇప్పటికీ మీడియా వాళ్లు, సోషల్ మీడియా జనాలు అన్నా లెజ్‌నెవా అనే పిలుస్తుంటారు. ఈ పిలుపు ఇక వద్దే వద్దని అంటున్నారు. తన పేరును భర్త ఇంటిపేరైన కొణిదెలతో కలిపే పిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టాలో ఇంతకుముందే ఆమె తన పేరును.. అన్నా కొణిదెలగా మార్చుకున్నారు. తనను జనం కూడా ఇలాగే పిలవాలని కోరుతూ తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
అన్నా లెజ్‌నెవా అనే పేరును చివరగా పేర్కొన్న డాక్యుమెంట్.. పవన్‌తో తన పెళ్లి రిజిస్ట్రేషన్‌కు సంబంధించినదే అని.. ఆ రోజే తాను తన భర్త ఇంటి పేరును తీసుకున్నానని ఆమె చెప్పింది. తనను అందరూ అన్నా కొణిదెల అనే పిలవాలని.. అదే తన పేరని, ఆ పేరును తనదిగా భావిస్తానని తను పేర్కొంది. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోను షేర్ చేశారు. తాను, పవన్ కలిసి తొలిసారి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ పర్యటనకు వెళ్లినప్పటి ఫొటో అది పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
పవన్ తొలి రెండు వివాహాలు విఫలం కాగా.. తీన్‌మార్ సినిమా షూటింగ్‌లో పరిచయం అయిన అన్నాతో పవన్ ప్రేమలో పడ్డారు. రెండో భార్య రేణు దేశాయ్ నుంచి 2012లో విడాకులు తీసుకున్న పవన్.. తర్వాతి ఏడాది తనను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఆయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. అమ్మాయి పేరు పోలేనా అంజనా కాగా, అబ్బాయి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. రేణు ద్వారా ఆయనకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
