టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా నంబర్ వన్ డైరెక్టర్‌గా ఎదిగిన రాజమౌళి మీద కూడా అనేక కాపీ ఆరోపణలున్నాయి. మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌నైతే సోషల్ మీడియా జనాలు కాపీ మాస్టర్ అని అంటుంటారు. ఆయన రచయితగా పని చేసిన సినిమాలకు తోడు.. డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి కనిపిస్తుంది.
ఎపిసోడ్లకు ఎపిసోడ్లను కాపీ చేసి పెట్టేస్తాడంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తుంటారు. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్‌కు ఫ్రీమేక్ అంటూ అజ్ఞాతవాసి మీద ఆరోపణలు రావడం, స్వయంగా ఆ చిత్ర దర్శకుడే ఈ మాట చెప్పడం అప్పట్లో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇంకా త్రివిక్రమ్ తీసిన అనేక సినిమాల్లో కథలు, సన్నివేశాల మీద ఇలాంటి ఆరోపణలున్నాయి.
ఇప్పుడు మాటల మాంత్రికుడు తీస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం విడుదలకు ముందే ఈ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అర్జున్ నటించిన తమిళ చిత్రం బ్లాస్ట్ కథకు, దీనికి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బ్లాస్ట్ రిలీజయ్యాక కథలో మార్పులు చేర్పులు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం నుంచి రిలీజవుతున్న కొత్త పోస్టర్లు, హీరో క్యారెక్టర్ టీజర్ చూశాక నెటిజన్లు రకరకాల హాలీవుడ్ కంటెంట్‌తో పోలికలు పెడుతున్నారు.
ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అనే అమెరికన్ టీవీ సిరీస్ ఆధారంగా ఈ సినిమా తీశారని కొందరంటుంటే.. మరికొందరేమో వుయ్ ఆర్ ద మిల్లర్స్ అనే ఓ హాలీవుడ్ మూవీతో దీన్ని పోలుస్తున్నారు. ఆ సిరీస్, ఈ సినిమాలోని పాత్రలకు.. ఆదర్శ కుటుంబంలోని క్యారెక్టర్లకు లింక్ పెట్టి.. రకరకాల థియరీలు వండుతున్నారు. కాపీ కొట్టడమో, స్ఫూర్తి పొందడమో లేకుండా త్రివిక్రమ్ సినిమానే తీయడన్నట్లుగా నెటిజన్లు ఆయన కొత్త చిత్రాన్ని మొదట్నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ ట్రోల్స్‌కు సమాధానంగా ఒరిజినల్ సినిమా తీసి త్రివిక్రమ్ అందరికీ సమాధానం చెబుతాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
