టాక్ ఎలా ఉన్నా 200 కోట్లు పక్కా

స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం మతిపోతుంది. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో అజ్ఞాతవాసి డే వన్ రికార్డు భద్రంగా ఉందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కానీ నిజం. పవన్ కళ్యాణ్ స్టామినా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తేవడం గురించి గతంలో బోలెడు ఉదంతాలు ఉన్నాయి. అలాంటి స్టార్ డం కోలీవుడ్ లో విజయ్ కున్న సంగతి తెలిసిందే. ఆ నమ్మకమే ఏకంగా తమిళనాడు సిఎంని చేసింది.

ఇటీవలే విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. అయినా సరే మొదటి వారం పూర్తి చేసుకునేలోపు రెండు వందల కోట్ల మైలురాయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. టాక్ నెగటివ్ గా ఉన్నా, సెకండాఫ్ మీద కంప్లైంట్స్ వినిపించినా అవేవి అభిమానులు పట్టించుకోవడం లేదు. తలపతిని చివరిసారి వెండితెరపై సెలెబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఫలితమే భారీ వసూళ్లు.

ఒకవేళ యునానిమస్ పాజిటివ్ టాక్ అన్ని భాషల్లో వచ్చి ఉంటే కనక కోలీవుడ్ కి వెయ్యి కోట్ల గ్రాసర్ అయ్యేదన్న కామెంట్స్ లో అబద్దం లేదు. ఎందుకంటే విజయ్ కు ఆ కెపాసిటీ ఉంది. కానీ సేఫ్ గేమ్ ఆడాలని భగవంత్ కేసరి ఎంచుకోవడం ఒక పొరపాటు అయితే, దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేందుకు దర్శకుడు హెచ్ వినోత్ ని ప్రేరేపించడం ఇంకో బ్లండర్. ఇవి రెండు చేయకుండా కొత్త సబ్జెక్టు రాసుకుని ఉంటే ఇవాళ బాక్సాఫీస్ ముఖచిత్రం ఇంకోలా ఉండేది.

ఇకపై సినిమాల్లో నటించనని విజయ్ గతంలోనే ప్రకటించాడు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా జన నాయకుడుని చివరి మూవీగా అంగీకరించాల్సిందే. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఈ తరహా స్టేట్ మెంట్స్ ఇచ్చారు కానీ మాట మీద నిలబడలేదు. కానీ విజయ్ కేసు వేరు. ఎన్నికల బరిలో దిగిన మొదటిసారి ముఖ్యమంత్రి అయిపోయారు. సో భవిష్యత్తులో మేకప్ వేసుకుని స్క్రీన్ మీదకు రావడం అనుమానమే. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.