చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు అమ్మాయి తమిళంలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ‘లవర్’ చిత్రంతో కోలీవుడ్లో అడుగు పెట్టిన ఆమె.. జి.వి.ప్రకాష్ కుమార్ సరసన ‘హ్యాపీ రాజ్’ అనే చిత్రంలో నటించింది. జయం రవి లాంటి పెద్ద హీరోతో ‘బ్రో కోడ్’ అనే సినిమాలోనూ నటిస్తోంది గౌరీప్రియ. ఆమెకు తెలుగులో ‘మ్యాడ్’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అంతకుమందు వెబ్ మూవీ ‘మెయిల్’తో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. ‘చెన్నై లవ్ స్టోరీ’తో తన కెరీర్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందని భావిస్తున్నారు. ఈ అమ్మాయి ఇప్పుడో ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమైన విషయాలు పంచుకుంది. అనుకోకుండా ‘మిస్ హైదరాబాద్’ కావడం.. క్యాన్సర్ కారణంగా తల్లిని కోల్పోవడం గురించి ఆమె వెల్లడించింది. 

‘‘నాకు చిన్నప్పటి నుంచి అన్నీ అమ్మే. ఆమె నాకు మెంటార్‌గా ఉండేది. అలాంటి వ్యక్తిని కొన్నేళ్ల ముందు కోల్పోయాను. ఆమెకు క్యాన్సర్‌ అని తెలిసినపుడు తట్టుకోలేకపోయా. క్యాన్సర్ అని బయటపడ్డపుడే అది చివరి స్టేజ్. జబ్బు బయటపడ్డ రెండు నెలల్లోనే చనిపోయింది. ఆ సమయంలో నేను చాలా భయపడిపోయా. ఆ బాధలో బరువు కూడా తగ్గిపోయా. ఇప్పటికీ అమ్మను తలుచుకోగానే నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి. నాకు అమ్మ చీరలంటే ఇష్టం. మా అమ్మవే కట్టుకుంటూ ఉంటా’’ అని శ్రీ గౌరీప్రియ చెప్పింది. 

ఇక ‘మిస్ హైదరాబాద్’ కావడం గురించి గౌరీప్రియ మాట్లాడుతూ.. ‘‘పదిమంది స్నేహితులం కలిసి ‘మిస్ హైదరాబాద్’ పోటీలకు సరదాగా అప్లై చేశాం. ఒక్క రౌండు అయినా దాటుతానా అనుకుంటే.. నేను ఏకంగా ఫైనల్‌కు వెళ్లాను. అప్పటిదాకా తేలిగ్గా తీసుకున్న నేను.. ఫైనల్‌కు ముందు ప్రిపేరయ్యా. హైహీల్స్‌తో ప్రాక్టీస్ చేస్తే మోకాలికి దెబ్బ తగిలింది. నడవలేని స్థితిలో ఫైనల్‌కు వెళ్లాను. అక్కడ బాగా పెర్ఫామ్ చేసి ‘మిస్ హైదరాబాద్’ అవడంతో నా ఆనందానికి అవధుల్లేవు. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా, లవ్ స్టోరీ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశా. మెయిల్‌తో పాటు మ్యాడ్ నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి’’ అని చెప్పింది.