కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి కట్టుబడలేక వాయిదా వేసుకోవడం, దీని వల్ల ఇతర చిన్న నిర్మాతలు ఇబ్బంది పడటం పరిపాటిగా మారింది. ఈ కారణంగానే ఈ ఏడాది రెండు మూడు మంచి తేదీలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్ లాంటి హిట్లు కూడా ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో ఉన్న మూవీ ప్యారడైజ్.

ఆగస్ట్ 21 వదిలేసుకొని ఇరుముడికి ఇచ్చేశాక ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. టీమ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 24 పక్కాగా లాక్ చేసుకుందని విశ్వసనీయ సమాచారం. అలాని షూటింగ్ మొత్తం అయిపోయిందని కాదు. ఇంకా ముప్పై రోజుల వర్క్ పెండింగ్ ఉందట. ఇందులోనే పాటల చిత్రీకరణ ఉంది. ఇటీవలే క్లైమాక్స్ తీస్తున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కత్తి కొనల మీద పరుగులు పెడుతూ డెడ్ లైన్ కోసం కష్టపడుతున్నారు.

ఈసారి టార్గెట్ మిస్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఓటిటి డీల్ దృష్ట్యా ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ జరిగిపోవాలి. ఇంతకన్నా లేట్ చేయడం చాలా రకాలుగా మంచిది కాదు. ఇప్పటికే బోలెడు ఆలస్యం జరిగింది. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి బ్రేక్ ఈవెన్ అంతకంతా పెద్దదిగా మారుతోంది. ఇది తీవ్ర రూపం దాలిస్తే సినిమా హిట్టయినా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కనిపించవు. అందుకే వీలైనంత వేగంగా క్వాలిటీ తగ్గకుండా గుమ్మడికాయ కొట్టేయాలి.

టీమ్ నుంచి అధికారిక ప్రకటన ఈ వారంలోనే వచ్చే అవకాశముంది. నాని ఏడాదికి పైగా సమయం ప్యారడైజ్ కోసం ఖర్చు పెట్టాడు. మార్చిలో రావాల్సిన మూవీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత వస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ప్యారడైజ్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ తండ్రి కొడుకులుగా విలన్ పాత్రల్లో కనిపించనున్నాడు,. జడల్ క్యారెక్టర్ లో నాని చాలా షాకింగ్ గా ఉంటాడని, ఇది కొత్త ట్రెండ్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.