ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్ తెరకెక్కేవి చాలా తక్కువ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గత ఏడాది రెండు సినిమాలు రిలీజైతే.. రెంటికీ సీక్వెల్స్ ప్రకటించారు. నిజానికి ‘హరిహర వీరమల్లు’ కథను మధ్యలో ఆపి సెకండ్ పార్ట్ తీస్తామన్నారు. కానీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో రెండో భాగం తీయడానికి ఆస్కారం లేకపోయింది.

‘ఓజీ’ సినిమాను కథను ఒక దగ్గర ముగించినప్పటికీ.. సీక్వెల్‌కు లీడ్ అయితే ఇచ్చారు. కానీ నిజంగా ఆ సినిమా తెరకెక్కుతుందని నమ్మిన వాళ్లు తక్కువమంది. ఎందుకంటే పవన్ పొలిటికల్‌గా అంత బిజీ అయ్యాడు. పైగా సీక్వెల్ తీసేంత స్కోప్ ‘ఓజీ’ కథలో ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అందుకే ఇటు పవన్, అటు సుజీత్ సీక్వెల్ గురించి, ఓజీ యూనివర్శ్ గురించి ప్రస్తావించినా.. జనాలకు నమ్మకం కలగలేదు. కానీ ఎక్కువ టైం తీసుకోకుండా ఈ ఇద్దరూ చేతులు కలిపేశారు. ‘ఓజీ-2’కు సన్నాహాలు మొదలైయ్యాయి.

సరిగ్గా ఎప్పుడు సినిమా మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ వర్క్ అయితే చురుగ్గానే జరుగుతోందని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో స్పష్టం అయిపోయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ వార్తను ఆకళింపు చేసుకుని.. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందనే చర్చలు మొదలుపెట్టారు. ఐతే ‘ఓజీ’ ప్రి రిలీజ్ హైప్ వల్ల, ఎలివేషన్ల వల్ల, సుజీత్ టేకింగ్-పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల భారీ వసూళ్లే రాబట్టింది కానీ.. ఆ చిత్రం ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినైతే ఇవ్వలేదన్నది వాస్తవం.

సుజీత్ నుంచి కథ పరంగా ఇంకా ఎక్కువే ఆశించారు ఆడియన్స్. అలాగే టేకింగ్ బాగున్నా.. కథలో కొత్తదనం, సర్ప్రైజులు తక్కువే. మరోవైపు పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లలో చేసిన ఇతర చిత్రాలతో పోలిస్తే ఇందులో బాగా కనిపించాడు, బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు కానీ.. ఆయన ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘ఓజీ’లో ఇటు సుజీత్, అటు పవన్ ఇద్దరూ తమ ఫుల్ పొటెన్షియాలిటీ అయితే చూపించలేదన్నది వాస్తవం.

‘ఓజీ’కి హైప్ కలిసొచ్చి భారీ వసూళ్లు రాబట్టింది కానీ.. ఈసారి కంటెంట్ ఇంకా బలంగా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారనడంలో సందేహం లేదు. కథలో ఎక్కువ విశేషాలు, వైవిధ్యం ఆశిస్తారు. టేకింగ్ కంటే రైటింగ్ మీద సుజీత్ ఎక్కువ దృష్టిపెట్టాలి. అలాగే పవన్.. ఈసారి తన పొలిటికల్ కమిట్మెంట్ల దృష్ట్యా ఆషామాషీగా సినిమా చేస్తే కష్టం.

మధ్య మధ్యలో బ్రేకులు ఇవ్వకుండా వరుసగా డేట్లు ఇచ్చి, యాక్షన్ ఘట్టాలు-పెర్ఫామెన్స్ విషయంలో మరింత ఎఫర్ట్ పెట్టి సినిమాకు సహకరించాల్సి ఉంటుంది. మొత్తంగా టీం ఆడియన్స్‌ను గ్రాంటెడ్‌గా తీసుకోకుండా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఓజీ-2 అంచనాలను అందుకోగలుగుతుంది.