ఫోటో కోసం శ్రీలీలను పక్కకు జరిపిన సీఎం భార్య?

ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఎస్వీపీ స్టేడియంలో అమృత ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని దివ్యాజ్ ఫౌండేషన్ ఈ యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, జాకీ ష్రాఫ్ లతో పాటు శ్రీలీల కూడా ప్రత్యేక అతిథిగా హాజరైంది.

ఈ కార్యక్రమంలో ఫోటో సెషన్ జరుగుతున్న సమయంలో ఊహించని మూమెంట్ అందరిని షాక్ కు గురిచేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత, ఆమె కూతురు దివిజలతో కలిసి శ్రీలీల ఫోటోలకు పోజులిస్తున్న క్రమంలో.. అమృత తన చేత్తో శ్రీలీలను పక్కకు తప్పుకోమని సైగ చేసింది. ఫ్రేమ్ లో నుంచి బయటకు వెళ్లాలంటూ ఆమె వేలు చూపించినట్లు ఉన్న ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

ఈ వీడియో చూసిన శ్రీలీల అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. క్రేజ్ ఉన్న ఒక పాపులర్ హీరోయిన్ ను ఈవెంట్ కు పిలిచి ఇలా పక్కకు జరగమనడం అవమానించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. అమృత ప్రవర్తన అహంకారంతో కూడుకున్నదంటూ నెటిజన్లలో ఒక వర్గం ఆమెపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వేగంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది.

అయితే ఈ వివాదంపై మరో వాదన కూడా స్పష్టంగా వినిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రెస్ ఫోటోగ్రాఫర్లు కేవలం తల్లీకూతుళ్ల ఫోటోలు మాత్రమే సెపరేట్ గా కావాలని అడగడం వల్లే అమృత అలా స్పందించిందని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగా శ్రీలీలను అవమానించాలనే ఆలోచన ఆమెకు లేదని, మీడియా అభ్యర్థన మేరకే అలా పక్కకు జరగమని సూచించిందని వివరిస్తున్నారు.

ఇందులో ఎలాంటి తప్పు లేదని వారు వాదిస్తున్నారు. అయితే నెట్టింట ఈ ఘటనపై ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఇప్పటివరకు శ్రీలీల టీమ్ నుంచి కానీ, అమృత ఫడ్నవీస్ వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇరు వర్గాల నుంచి క్లారిటీ వస్తే కానీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు.