రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి అనేక సినిమాలు చేశారు. ఐతే తర్వాత కూడా వ్యక్తిగత స్నేహం కొనసాగినప్పటికీ.. కలిసి సినిమాలు మాత్రం చేయడం ఆపేశారు. ఇలాగే నాలుగు దశాబ్దాలకు పైగా కాలం గడిచిపోయింది. ఐతే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు.

అందులో ఒకటి కమల్ నిర్మాణంలో రజినీ నటించే సినిమా కాగా.. ఇంకోటి ఈ ఇద్దరూ హీరోలుగా నటించే చిత్రం. కలిసి నటించే సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్‌ను దర్శకుడిగా ఎంచుకుని ఒక ప్రోమో వీడియో కూడా చేసింది రజినీ, కమల్ జోడీ. ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి బాగా టైం పట్టేలా ఉంది. దాని కంటే ముందు కమల్ ప్రొడక్షన్లో రజినీ హీరోగా నటించే సినిమా విషయంలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి.

ముందు సుందర్‌ను దర్శకుడిగా ఎంచుకుంటే ఆయన తప్పుకున్నారు. ఆపై శిబి చక్రవర్తికి అవకాశమిస్తే.. అతనూ ఈ ప్రాజెక్టులో కొనసాగలేదు.
చివరికి రజినీ హీరోగా ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాల దర్శకుడు అశ్విన్ మారిముత్తుతో సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఇంకా ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సినిమా ముందుకు కదిలిందన్నది మాత్రం నిజం.

ఈసారి అనౌన్స్‌మెంట్లు ఏమీ లేకుండా నేరుగా అశ్విన్ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయారట. చెన్నైలో సైలెంటుగా ఈ సినిమా షూట్ మొదలుపెట్టేశారట. ఐతే తొలి షెడ్యూల్లో రజినీ లేకుండానే వేరే నటులుతో చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం.

మరోవైపు రజినీతో సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ అయిపోయిందని శిబి ఫీలవ్వాల్సిన పనేమీ లేదని తెలుస్తోంది. రజినీకి నచ్చని అతడి కథను కమల్ ఇష్టపడ్డారట. అతణ్ని కమల్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌లోనే కొనసాగిస్తున్నారట.

ఆ స్క్రిప్టును డెవలప్ చేయిస్తున్నారట. కుదిరితే కమల్, లేదంటే ఇంకో సీనియర్ హీరోతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారట. రజినీకి నచ్చని కథ కమల్‌కు నచ్చిందంటే అది లోకనాయకుడి స్టయిల్లో డిఫరెంట్‌గా ఉందని భావించవచ్చు. శివకార్తికేయన్ హీరోగా శిబి రూపొందించిన తొలి చిత్రం ‘డాన్’ పెద్ద హిట్టే అయింది.