తెలుగులో సంగీత దర్శకుడిగా తమన్ ప్రయాణం కిక్ అనే బ్లాక్‌బస్టర్ మూవీతో మొదలైంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడం, పాటలకూ మంచి స్పందన రావడంతో కెరీర్ ఆరంభంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. పెద్ద పెద్ద హీరోలతో చాలా త్వరగా సినిమాలు చేసేశాడు. కానీ కెరీర్లో తొలి దశాబ్దంలో అతను ఎప్పుడూ నంబర్ వన్ అని మాత్రం అనిపించుకోలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ అతడి మీద ఆధిపత్యం చలాయిస్తూనే వచ్చాడు. కానీ గత రెండు మూడేళ్లలో కథ మారిపోయింది.
తమన్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని భిన్నమైన పాటలు ఇవ్వడం, వరుసగా అతడి ఆడియోలకు అదిరే రెస్పాన్స్ రావడంతో దేవిశ్రీ వెనుకబడిపోయాడు. ఇప్పుడు తమన్ టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు.
కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ భాషల్లో తమన్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. 2021లో అతడి చేతిలో పది సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో దాదాపు అన్ని సినిమాలూ ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఈ పది చిత్రాల్లో అతి త్వరలోనే కొన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. క్రాక్, ఈశ్వరన్. ఈ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఇవి కాక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్, అయ్యప్పనుం కోషీయుం రీమేక్ తమన్ ఖాతాలోనివే. అలాగే మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాటకూ తమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా నాని టక్ జగదీష్, వరుణ్ తేజ్ బాక్సర్, బాలకృష్ణ-బోయపాటి చిత్రం.. ఇలాంటి క్రేజీ సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ సినిమా యువరత్న, మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కుతున్న కడువ చిత్రాలకూ తమనే సంగీతం అందిస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే 2021లో సౌత్ ఇండియాలో తమన్‌ను కొట్టే సంగీత దర్శకుడు లేనట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates