పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో తన స్వగృహానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు హుషారుగానే కనిపించారు. తాజాగా పాలన వ్యవహారాలు మొదలుపెట్టేశారు. సరిపడా విశ్రాంతి దొరకడంతో ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే ఎప్పటిలాగా ప్రెస్ మీట్లు, క్షేత్ర పర్యటనలు ఉన్నాయని డిసిఎం ఆఫీస్ చెబుతోంది.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో కొనసాగడం గురించి సస్పెన్స్ అయితే తొలగిపోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజై రెండు నెలలు అయిపోయింది. దర్శకుడు సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. తుది నెరేషన్ విన్నాక అంతా ఓకే అనుకుంటే నిర్మాత రామ్ తాళ్ళూరి ఆఘమేఘాల మీద షూటింగ్ వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. అయితే అసలు సమస్య పవన్ సెట్స్ లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా లేదాని.

ఇంకోవైపు నాని బ్లడీ రోమియో లేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో దర్శకుడు సుజిత్ ఓజి 2 మీద వర్క్ చేస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. కానీ అది పూర్తి వాస్తవం కాదట. ప్యారడైజ్ వంద శాతం ఆగస్ట్ 21 రిలీజైపోతుంది కాబట్టి తక్కువ గ్యాప్ తీసుకుని వెంటనే వస్తానని నాని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇది కనక నిజమైతే సుజిత్ ఇంకో మూడు నెలలు వెయిట్ చేయడం పెద్ద సమస్య కాదు. పైగా ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించినట్టు అవుతుంది.

సో ఇదంతా ఇప్పుడప్పుడే తేలే యవ్వారం కాదు. చంద్రబాబు, మోడీలతో పాటు సహచర మంత్రులు, జనసేన ప్రతినిధులు పవన్ ని ఇప్పట్లో సినిమాల గురించి ఆలోచించవద్దని సూచిస్తున్నారట. ఆరోగ్యం సెట్ అయినప్పటికీ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు రావొచ్చని, కాబట్టి ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చే అవకాశాలు పరిశీలించమని అడుగుతున్నారట. మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో ఏం చేస్తారో తేలడానికి ఇంకొంత టైం పట్టొచ్చు.