తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలు తెరమీదకు వచ్చాయి. అద్దెల విధానం వల్ల తాము ఎంత నష్టపోతున్నామో వివరించిన విధానం అందరినీ షాక్ కు గురి చేసింది. మన శంకరవరప్రసాద్ గారుకి ఒక సింగల్ స్క్రీన్లో 50 లక్షలు నెట్ వస్తే, అందులో 5 లక్షలు థియేటర్ ఓనర్ కి, 45 లక్షలు ప్రొడ్యూసర్ కు వెళ్ళిపోయిన ఉదాహరణ ఆలోచింపజేసేలా ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇకపై జీవో తెచ్చుకున్నా సరే సింగల్ స్క్రీన్లలో ఇప్పుడు ఉన్న ధరలే ఉంటాయని చెప్పడం అందరికి షాక్ కలిగించింది. ఎందుకంటే అమలులో చాలా సమస్యలు వస్తాయి. అలాని ఉపయోగాలు లేవని కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం పెంచుకోండి అని అనుమతి ఇచ్చినా ఆ అవకాశాన్ని వాడుకోకపోవడం ప్రేక్షకుల కోణంలో చాలా గొప్ప నిర్ణయం అవుతుంది. స్టార్ హీరోల అభిమానులు పండగ చేసుకున్నట్టే.
వచ్చే నెల జూన్ 4 పెద్ది రానుంది. మరి ఆ టైంకంతా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకే తాటి మీదకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కేవలం మల్టీప్లెక్సుల్లో ఎంజాయ్ చేసే సినిమా కాదది. సింగల్ స్క్రీన్లలో సంబరాలు చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అటుపై వరసగా ప్యారడైజ్, విశ్వంభర, స్వయంభు, సంబరాల ఏటిగట్టు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయి. ఇవన్నీ హైక్స్ కోరుకునే భారీ బడ్జెట్ సినిమాలు.
నైజాం పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఇదే డిమాండ్ తో త్వరలోనే వీళ్ళు సమావేశం కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఒకే డిమాండ్ వినిపించబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మూతబడిన సింగల్ స్క్రీన్ల సంఖ్య మరింత పెరగకుండా ఉండటం కోసమే తామీ చర్యలకు పూనుకున్నట్టు థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates