పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తమ అభ్యర్థనలు పంచుకున్న థియేటర్ ఓనర్లు కం ఎగ్జిబిటర్లు తమకు అద్దెలు వద్దని చెబుతూ మల్టీప్లెక్సులకు అమలు చేస్తున్న తరహాలో తమకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇది కనక పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరు నుంచి సింగల్ స్క్రీన్ల బందుకు పిలుపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వినికిడి. కానీ అలా చేయకుండానే పోరాడాలని చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిబీటర్లు సైతం ఇదే డిమాండ్ తో త్వరలో సమావేశం కాబోతున్నారు. వస్తున్న ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని, కాబట్టి స్థిరమైన పర్సెంటేజ్ విధానాన్ని తీసుకురావాలని వాళ్ళూ కోరుతున్నారు. అంటే అటు ఇటు తిరిగి ఇది పెద్ది టైంకంతా పెద్ద రచ్చగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో హరిహర వీరమల్లు టైంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. సమస్యని తాత్కాలికంగా ఆపగలిగారు కానీ పరిష్కారం కాలేదు.

టాలీవుడ్ ఈ విషయంలో రెండుగా విడిపోయిందనేది ఓపెన్ సీక్రెట్. అగ్ర నిర్మాతలు కొందరు ఈ విధానం పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరు. దాని ప్రభావం ఇటీవలే సత్య నడిచిన జెట్లీ మీద గట్టిగా పడింది. హైదరాబాద్ లో తక్కువ షోలు పడ్డాయి. సరే అదంటే చిన్న సినిమా కాబట్టి ఎవరికి ఇబ్బంది అనిపించలేదు. కానీ పెద్ది అలా కాదు. సంక్రాంతి తర్వాత వస్తున్న అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీ. జనాలు ఆకలితో ఉన్న టైంలో రామ్ చరణ్ భారీ అంచనాలతో దిగుతున్నాడు.

సో వీలైనంత త్వరగా సయోధ్య కుదుర్చుకోవాలి. లేదంటే పెద్ది రిలీజప్పుడు లేనిపోని తలనెప్పి అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దిని సింగల్ స్క్రీన్స్ లో ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఒకవేళ పైన చెప్పిన ఇష్యూ సాల్వ్ కాకపోతే వాళ్ళు మల్టీప్లెక్సులకు వెళ్లేందుకు ఇష్టపడరు. అయినా పెద్దిని వదులుకోవడానికి, వేసుకోకుండా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు కానీ త్వరగా పరిష్కారం అయితే అదే పది వేలు అంటోంది ఇండస్ట్రీ.