చల్లబడిపోకుండా అభిజీత్‍ జాగ్రత్త

బిగ్‍బాస్‍ కంటెస్టెంట్లను ఎప్పుడూ వేధించే సమస్య ఏమిటంటే… ఒకసారి సీజన్‍ ముగిసిన తర్వాత వాళ్ల గురించి జనం అంతగా పట్టించుకోరు. హౌస్‍లో వున్నంతసేపు రోజూ సోషల్‍ మీడియాలో పడి చర్చలు జరుపుతారు కానీ సీజన్‍ అయిపోయిన తర్వాత వేరే ఎంటర్‍టైన్‍మెంట్‍ వెతుక్కుంటారు. అందుకే బిగ్‍బాస్‍ ముగిసిన కొద్ది వారాలలో అందులో పాల్గొన్నవారు నెమ్మదిగా సైడ్‍లైన్‍ అయిపోతుంటారు.

అయితే తనను జనం మరచిపోకుండా చూసుకోవడమే కాకుండా న్యూస్‍లో కూడా తాను తప్పకుండా వుండేలా అభిజీత్‍ జాగ్రత్తలు పాటిస్తున్నాడు. క్రిస్మస్‍ రోజున శాంటా అవతారమెత్తిన అభిజీత్‍ ఆ తర్వాత తన లైఫ్‍ ఈజ్‍ బ్యూటిఫుల్‍ దర్శకుడు శేఖర్‍ కమ్ములతో పాటు అందులో తనతో పాటు నటించిన సహ నటుడిని కలిసి ఏదో ఒక విధంగా న్యూస్‍లో వుండేలా చూసుకున్నాడు.

అయితే అభిజీత్‍ ఇలాంటి ఫోటో సెషన్లు, చారిటీ కార్యక్రమాలు కాకుండా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకున్నట్టయితే అందరూ తనగురించి మాట్లాడుకుంటారు. బిగ్‍బాస్‍ గత సీజన్ల విజేతలెవరూ ఆ తర్వాత ఏమంత చేసిందేమీ లేదు. అభిజీత్‍ అయినా ఓటిటి ట్రెండ్‍ని క్యాచప్‍ చేసి హీరోగా మళ్లీ బ్రేక్‍ సాధిస్తాడని అతడికి ఓట్లేసి గెలిపించిన వాళ్లు ఎదురు చూస్తున్నారు.