కోలీవుడ్ తుఫాను టాలీవుడ్డుకు పాకుతుందా

తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు భారీ రెమ్యునరేషన్లు కాకుండా రెవిన్యూ షేరింగ్ మోడల్ లోకి రావాలనే డిమాండ్ లో తొలి అడుగుగా ఈ బందుకు పిలుపు ఇచ్చారు. దీని వల్ల షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగులు అన్నీ ఎక్కడిక్కడ ఆగాయి. ఇది తాత్కాలికమే అయినా ఒక్క రోజు నష్టం అయితే తీవ్రంగానే ఉండబోతోంది. ఇప్పటికైతే స్టార్లు ఎవరూ స్పందించలేదు.

ఈ సమస్య కేవలం తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ ఉంది. నిర్మాతే నష్టాన్ని ఎందుకు భరించాలనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన. కానీ ఇందులో క్లిష్టమైన కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ఏ హీరో కూడా ప్రొడ్యూసర్లను తనతో సినిమాలు తీయమని బలవంత పెట్టడం లేదు. నిర్మాతలు తాముగా వెళ్లి ఇంత ఇస్తే గిట్టుబాటు అవుతుందనే నమ్మకంతోనే ప్రాజెక్టులు లాక్ చేసుకుంటున్నారు. అందుకే వరసగా నాలుగైదు ఫ్లాపులు ఉన్న హీరోలు సైతం రెండేళ్ల దాకా కాల్ షీట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు.

సప్లై అండ్ డిమాండ్ సూత్రాన్ని అనుసరించే తాము రెమ్యునరేషన్లు తీసుకుంటాం తప్పించి అదే పనిగా ఎక్కువ డిమాండ్ చేసినంత మాత్రం ఇవ్వరు కదా అనే మాటలో తర్కం ఉంది. ఇక నిర్మాతల వైపు ఆలోచిస్తే వందల కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు రిస్క్ మొత్తం వాళ్ళ భుజాల మీదే ఉంటుంది. తేడా వస్తే డిస్ట్రిబ్యూటర్లు వేధించేది వీళ్ళనే. అందుకే నష్టం వచ్చినప్పుడు ఆదుకోమని అడిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. బాబా, జానీ లాంటి విషయంలో పరిష్కారం అయ్యాయి.

ఇక తమిళ తుఫాను తెలుగులో మొదలవుతుందా అంటే కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే 8 వారాల ఓటిటి, సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్, అడ్వాన్సుల వివాదాలు లాంటి ఎన్నో సమస్యలు సరైన ఐక్యత లేకుండా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. పైరసీ కూడా అందుకే మళ్ళీ మొదటికి వచ్చింది. సో కోలీవుడ్ లో మొదలైన టీ కప్పులో తుఫాను టాలీవుడ్ కాఫీ గ్లాసు దాకా వచ్చే అవకాశాలు తక్కువే. ఒకవేళ తమిళ నిర్మాతలు ఈ పోరాటంలో విజయం సాధిస్తే అప్పుడేమైనా మార్పు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.