జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని అంటూ ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ పాత్రతో ఎనలేని గుర్తింపు సంపాదించడం వల్ల జెనీలియాను.. ఎన్నేళ్లు గడిచినా ఒక చలాకీ అమ్మాయిగానే గుర్తుపెట్టుకుంటారు మన ఆడియన్స్. అలాంటి అమ్మాయి తీవ్ర భావోద్వేగంతో స్టేజ్ మీద ఏడ్చేయడం అస్సలు ఊహించలేం. కానీ తాజాగా ఆమె ఆ పనే చేసింది.
జెనీలియాకు కథానాయికగా అవకాశాలు తగ్గిపోయాక.. తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్ రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఆమె.. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చి వేద్, జూనియర్, సితారే జమీన్ పర్ లాంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు జెనీలియా నిర్మాతగా మారడం విశేషం. తన భర్త రితేష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా వహించిన ‘రాజా శివాజీ’ చిత్రాన్ని జెన్నీనే నిర్మించింది. ఈ చిత్రంలో ఆమె ఒక కథానాయికగానూ నటించింది.
‘రాజా శివాజీ’ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో రితేష్ మాట్లాడుతూ.. తన భార్య గురించి గొప్పగా మాట్లాడాడు. ఈ సినిమా నిర్మాణంలోనే కాక వివిధ సందర్భాల్లో జెన్నీ తనకెలా మద్దతుగా నిలిచిందో అతను గుర్తు చేసుకున్నాడు.
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణం గురించి కూడా తలుచుకుని అతను భావోద్వేగానికి గురయ్యాడు. భర్త ఇలా ఎమోషనల్‌గా తన గురించి, మావయ్య గురించి మాట్లాడుతున్నపుడు జెన్నీ కూడా ఉద్వేగానికి గురైంది.
ఆమె కన్నీళ్లు ఆపుకోలేక ఒక పక్కకు తిరిగి ఏడ్చేసింది. తర్వాత ఇక చాలు అన్నట్లుగా ఆమె తల ఊపింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే జెనీలియా ఇంత ఎమోషనల్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రితేష్ ఇప్పటికే దర్శకుడిగా ‘మజిలీ’ రీమేక్ ‘వేద్’ తీశాడు. అది మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ఐతే ఇప్పుడు భారీ బడ్జెట్ పెట్టి తీసిన ప్రెస్టీజియస్ మూవీ ‘రాజా శివాజీ’ని హిట్ చేయడం మాత్రం రితేష్‌కు పెద్ద సవాలే.
Gulte Telugu Telugu Political and Movie News Updates