సినిమా వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయంటే..

సినిమా వాళ్లకేంటండీ బాబూ.. కోట్లల్లో పారితోషకాలు, రాజభోగాలు అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ వైభవం కొంతమందికే పరిమితం. ఇక్కడ మెజారిటీ జనాల పరిస్థితి దయనీయం. నిరంతరం అనిశ్చితితో బతికే సినీ ఆర్టిస్టులు, కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

లాక్ డౌన్ వల్ల ఇలాంటి వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో చెబుతూ బెంగాలీ టీవీ ఆర్టిస్టు సులఘ్న ఛటర్జీ ఒక వీడియోను రూపొందించింది. అది చూస్తే సినిమా వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఆమె ఈ వీడియోలో ఏమీ మాట్లాడకుండా కేవలం ప్లకార్డుల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ల కష్టాల గురించి హృద్యంగా చెప్పింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.

‘‘నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తా. ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లించే రంగాల్లో ఇదొకటి. లాక్ డౌన్ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నది మేమే. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెగ్యులర్‌గా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. చేతికి పని దొరికితే నోటికి తిండి.. మాలో చాలామంది పరిస్థితి ఇదే. మాకందరికీ 2 నెలలుగా పని లేదు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయం నుంచే పని దొరకట్లేదు. అన్ని ఆఫీసులూ మూతబడి ఉండటంతో పాత బకాయిలు చెల్లించలేదు.

మేం ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల్లో ఉండాలి. మా లైఫ్ స్టైల్ కూడా రిచ్‌గా ఉండక తప్పని పరిస్థితి. మమ్మల్ని వలస కార్మికులుగా పరిగణించరు కాబట్టి మా స్వస్థలాలకు వెళ్లలేం. లాక్ డౌన్ ముగిసినా కొన్ని నెలల పాటు మాకు పనులు దొరకవు. రెగ్యులర్ ఖర్చులతో పాటు అప్పులు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. మాకు ఫిక్స్డ్ శాలరీ ఉండదు. పీఎఫ్, గ్యాట్యుటీ లాంటివేమీ ఉండవు. ఒక్కో ప్రాజెక్ట్ మేర పని చేస్తాం. క్రమం తప్పకుండా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. ఏ విపత్తు వచ్చినా మేం అండగా నిలిచే ప్రయత్నం చేస్తాం. కానీ మాకు కష్టం వస్తే ఎవ్వరూ అండగా నిలవరు. మా బాధల గురించి ఎవరూ మాట్లాడరు, పట్టించుకోరు’’ అంటూ సినీ జనాల కష్టాల్ని చెప్పుకొచ్చింది సులఘ్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.