చిరంజీవి చుట్టూ డబుల్ అయోమయం

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో అంటూ మెగా 158 ఓపెనింగ్ వాయిదా పడుతూనే ఉంది. దర్శకుడు బాబీ కొల్లి స్క్రిప్ట్ పనులు, క్యాస్టింగ్ సిద్ధం చేసుకుని రెడీగా ఉండగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ ను చుట్టుముట్టిన జన నాయగన్ సమస్యలు నిర్మాతకు నిద్ర పట్టనివ్వడం లేదు. దీంతో చిరు ప్రారంభోత్సవం మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ లెక్కన 2027 సంక్రాంతి విడుదల అసాధ్యం.

ఇక రెండోది విశ్వంభర విడుదల. ఊరికే డేట్ల గురించి పుకార్లు తిరుగుతుతున్నాయి తప్పించి యువి క్రియేషన్స్ నుంచి ఎలాంటి ఇన్ఫో రావడం లేదు. కొందరు జూలై 10 అంటున్నారు. ఇంకొందరు పెద్ది ఫిక్స్ అయితే తప్ప విశ్వంభర మోక్షం ఎప్పుడో తేలే ఛాన్స్ లేదని కొత్త భాష్యం చెబుతున్నారు. నిజానికి రెండింటికి సంబంధం లేదు. ఒకవేళ పెద్ది కోసం వెయిట్ చేసే పనైతే అది వదులుకున్న ఏప్రిల్ 30 విశ్వంభరని రిలీజ్ చేసి ఉండాల్సింది. అంటే కారణం అది కాదు.

ఇంకా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతూనే ఉన్నాయని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. ఈ రెండు పక్కన పెడితే చిరంజీవి నెక్స్ట్ ఒప్పుకున్న శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలుపెట్టే ఛాన్స్ కూడా ఇప్పుడప్పుడే లేదు. ఎందుకంటే శ్రీకాంత్ ముందు ప్యారడైజ్ ని ఆగస్ట్ రిలీజ్ చేసేందుకు విపరీతంగా శ్రమ పడుతున్నాడు. అది డిసెంబర్ కు వెళ్లొచ్చనే గాసిప్స్ మొదలైపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ కాకూడదనే సంకల్పంతో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. సో మెగా మూవీ గురించి ఆలోచించే టైం లేదు.

ఇప్పుడు వెయిట్ చేయడం తప్ప చిరంజీవి దగ్గర మరో ఆప్షన్ లేదు. బాబీ కోసం లుక్స్ మార్చుకుని, యంగ్ గా తయారైన మెగాస్టార్ ఇప్పుడు వాటిని ఈవెంట్స్, పెళ్లిళ్లలో బయట పెట్టుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. మెగా 158 రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. ఒక్కసారి ఆ లాంఛనం అయిపోయి బడ్జెట్ కనక చేతికి వస్తే షూటింగ్ పరుగులు పెట్టించేందుకు దర్శకుడు బాబీ రెడీగా ఉన్నాడు. మరి ఆ ముహూర్తం ఎప్పుడు రానుందో.