ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ ఒక స్టన్నింగ్ స్టోరీతో ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలను మించి తీర్చిదిద్దాడు. ఈ కథలో వచ్చే మలుపులు.. అందులోని భారీతనం.. విజువల్స్.. యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

రిలీజ్ టైంలో అనుకున్నంత పెద్ద సక్సెస్ కాకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది ‘యుగానికి ఒక్కడు’. తమిళంలో కంటే తెలుగులో ఈ చిత్రం బాగా ఆడడం విశేషం. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని సెల్వ రాఘవన్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు.

కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. ఒక దశలో కార్తిని కాకుండా ధనుష్‌ను పెట్టి సీక్వెల్ చేయాలనుకున్నాడు. కానీ అది ప్రకటనకే పరిమితం అయింది. తర్వాత కార్తితోనే యుగానికి ఒక్కడు-2 చేయడం కోసం ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది.

ఐతే సెల్వ ఎప్పటికైనా ఈ సీక్వెల్ చేస్తాడో లేదో కానీ.. ఒకవేళ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లినా తాను మాత్రం అందులో నటించనని తేల్చేసింది హీరోయిన్ ఆండ్రియా. ‘యుగానికి ఒక్కడు’లో రీమా సేన్‌తో పాటు ఆండ్రియా కీలక పాత్ర చేసింది. అందులో ఆమె సూపర్ సెక్సీగా కనిపించడమే కాక.. బాగా పెర్ఫామ్ చేసింది కూడా. ఆండ్రియాకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో అదొకటి.

సీక్వెల్‌లో చేయను అనడానికి కారణం చెబుతూ.. దర్శకుడు సెల్వ రాఘవన్‌తో పని చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. ‘యుగానికి ఒక్కడు’ కోసం తాను 200 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానని.. కానీ ఇప్పుడు అంత కష్టం పడే ఓపిక తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.

సెల్వతో సినిమా చేశాక, వేరే చిత్రాల్లో పని చేయడం తనకు చాలా తేలికగా అనిపించిందని ఆండ్రియా వ్యాఖ్యానించింది. మామూలుగా సీక్వెల్స్‌లో హీరోలను కొనసాగిస్తారు కానీ.. హీరోయిన్లను కంటిన్యూ చేయడం సందేహమే. అందులోనూ ఆండ్రియా ముందే నో చెప్పేసింది కాబట్టి, ‘యుగానికి ఒక్కడు-2’ తీసినా అందులో ఆండ్రియా ఉండదన్నమాటే.