ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇది అనైతికమని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ మేరకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పునిచ్చారు. దీనిపై ఇదివరకే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఆయన సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలోనూ నిబంధనలను పాటించలేదని.. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించడంతో పాటు ఈ వ్యవహారం మీద స్వతంత్ర వ్యవస్థతో విచారణ జరిపించాలని కూడా పిటిషనర్ కోరారు.
ఐతే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్, అడిషనల్ ఏజీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించారు. ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి పిటిషనే వేయగా.. ప్రభుత్వ పదవుల్లో ఉంటూ నటించడానికి అభ్యంతరం ఏమీ లేదని అప్పటి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకించారు.
తన సినిమాల టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి.. పవన్ కళ్యాణ్‌కు ఏ సంబంధం లేదని.. ఆయా చిత్రాల నిర్మాతల విజ్ఞప్తి మేరకు నిబంధనలను అనుసరించే రేట్లు పెంచుతున్నారని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో వేసిన వ్యాజ్యం ఇదని.. దీనికి విచారణ అర్హత కూడా లేదని వాదనలు వినిపించారు. దీనిపై సంతృప్తి చెందిన హైకోర్టు న్యాయమూర్తి విజయ్ కుమార్ పిటిషన్‌ను కొట్టివేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
