ఏప్రిల్ 30 విడుదల కావాల్సిన పెద్దికి సంబంధించి బాలన్స్ ఉన్న వాటిలో ముఖ్యమైనది ఐటెం సాంగ్. ఈ పాటకు తగిన హీరోయిన్ కోసం దర్శకుడు బుచ్చిబాబు మాములు కసరత్తు చేయడం లేదు. ఒకదశలో ముగ్గురు లేదా నలుగురిని పెడదామని ప్లాన్ చేసుకున్నాడు కానీ చేతిలో తక్కువ టైంలో ఉండటంతో, మళ్ళీ కొత్త ఒత్తిడిని నెత్తి మీద వేసుకోవడం ఎందుకని ఆ ఆలోచన మానుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ సరసన ఆడిపాడే భామగా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్టు సమాచారం.
నిజానికిది కొత్త లీక్ కాదు. వారాల క్రితమే బయటికి వచ్చింది. కానీ కన్ఫర్మేషన్ లేకపోయింది. తాజాగా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, పోస్టులు చూస్తుంటే పెద్ది సాంగ్ కోసమే హైదరాబాద్ వచ్చినట్టుగా అర్థమవుతోంది. మృణాల్ కు దీంతో పాటు మరో ముఖ్యమైన పని మీద భాగ్యనగరానికి పదే పదే తిరగాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న డెకాయిట్ ప్రమోషన్ల కోసం అడివి శేష్ టీమ్ ఆమె డేట్లను ప్రత్యేకంగా లాక్ చేసుకుంది.
మధ్యలో వచ్చే గ్యాప్ లో పెద్ది పాటను పూర్తి చేయొచ్చన్న మాట. సాంగ్ లో చరణ్, మృణాల్ తో పాటు జాన్వీ కపూర్ కూడా ఉంటుందని వినికిడి. అనౌన్స్ మెంట్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి కానుక ఇస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ లేదా ట్రైలర్ తో హైప్ మరింత పైకి వెళ్తుందని నమ్మకంగా ఉన్నారు. సో వెయిట్ చేయాలి.
ఇక పెద్ది వాయిదా పడుతుందనే ప్రచారాలకు టీమ్ చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ వచ్చే వారం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. బిజినెస్ వ్యవహారాలు మెల్లగా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ అవ్వకూడదనే సంకల్పంతో పెద్ది బృందం పగలు రాత్రి కష్టపడుతోంది. ఏఆర్ రెహమాన్ అందుబాటులోకి వచ్చేస్తే సెకండాఫ్ రీ రికార్డింగ్ మొదలైపోతుంది. సో ఎలా చూసుకున్నా పోస్ట్ పోన్ ఛాన్స్ అయితే లేనట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
