ఆమెకు అండగా అప్పుడు పవన్.. ఇప్పుడు బన్నీ

కొందరు నటులు పెద్ద పెద్ద పాత్రలు చేయకపోయినా.. చిన్న చిన్న క్యారెక్టర్లతోనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పావలా శ్యామల అలాంటి నటే. ఆమె వందల సినిమాల్లో నటించారు కానీ.. అన్నీ చిన్న చిన్న పాత్రలే. ఆంధ్రావాలా, గోలీమార్, మత్తు వదలరా లాంటి చిత్రాల్లో శ్యామల పంచిన వినోదాన్ని ప్రేక్షకులు మరిచిపోలేరు. ఐతే చేసినవన్నీ చిన్న పాత్రలే కావడంతో పెద్దగా సంపాదించుకోలేదు.

పైగా అనారోగ్యం పాలవడంతో డబ్బులు బాగా ఖర్చయిపోయి దీన స్థితికి చేరుకుంది. కొన్నేళ్ల ముందు పవన్ కళ్యాణ్‌కు విషయం తెలిసి ఆర్థిక సాయం అందజేశారు. ఇండస్ట్రీలో కూడా మరికొందరు శ్యామలను ఆదుకున్నారు. కానీ తర్వాత అందరూ ఆమెను మరిచిపోయారు. శ్యామల కూతురు సైతం అనారోగ్యం పాలవడంతో వారి పరిస్థితి ఇంకా దుర్భరంగా తయారైంది.

శ్యామలతో పాటు ఆమె కూతురు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకే చోట చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలియడంతో ఆయన టీం ఆమెను చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, ఆమె కూతురిని బన్నీ టీం మెంబర్ కలిసి.. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

వారికి ఇకపై ఇబ్బంది రాకుండా నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చేలా ఏర్పాటు చేశాడట బన్నీ. చికిత్సకు కూడా తాత్కాలికంగా కొంత సాయం అందజేసినట్లు సమాచారం.
తన సినిమా ‘పుష్ప-2’ రిలీజైనపుడు జరిగిన తొక్కిసలాటలో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న శ్రీతేజ్ కోసం కోట్లల్లో ఖర్చు చేశాడు బన్నీ. ఇంకా ఆ సాయం కొనసాగుతూనే ఉంది. బన్నీ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. దీనికి తోడు ఇప్పుడు శ్యామల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం ప్రశంసలు అందుకుంటోంది.