దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు నుంచి కోరుకుంటున్నారు. 2010 ప్రాంతంలోనే సాధ్యం కావాల్సిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు రెండేళ్ల ముందు ముందుకు కదిలింది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి.
మహేష్, రాజమౌళి చాలా ఆలస్యంగా కలిసినా.. ఈ ఆలస్యం కూడా మంచికే అనుకుంటున్నారు అభిమానులు. ఐతే రెండేళ్లుగా ఈ ఇద్దరూ మంచి అండర్‌స్టాండింగ్‌తో సాగిపోతున్నారు. అలాంటి ఇద్దరూ బీభత్సంగా కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కొంటె ఆలోచనతోనే ఏఐ సాయంతో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి ప్రెజెంట్ లుక్, మహేష్ ‘వారణాసి’ రుద్ర లుక్‌లో ఉండి.. ఒక కాఫీ షాప్ లాంటి ప్లేసులో ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నారు ఈ వీడియోలో. ఒకరి దెబ్బలకు ఇంకొకరు ఎగిరి పడి కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడం.. చుట్టూ ఉన్న వాళ్లు చూసి అవాక్కవ్వడం.. ఇలా సాగింది వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతికి చిక్కింది.
ఎక్స్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆర్జీవీ.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘సినిమా ఈజ్ డెడ్’ అని క్యాప్షన్ కూడా జోడించాడు. మామూలుగానే వర్మ ఏ వీడియో పంచుకున్నా వైరల్ అవుతుంది. అలాంటిది రాజమౌళి, మహేష్ బాబులు ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నట్లుగా రూపొందించిన వీడియో కావడంతో ఇది మరింతగా వైరల్ అవుతోంది. ఈ పాటికే ఈ వీడియో రాజమౌళి, మహేష్ బాబుల దృష్టిలో పడి ఉన్నా.. రేప్పొద్దున ఈ ఇద్దరూ దాని మీద స్పందించినా ఆశ్చర్యం లేదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates