‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మీద ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ నంబర్ నమ్మశక్యంగా అనిపించడం లేదు. హైప్ కోసమే ఆ నంబర్‌ను ప్రచారంలోకి తెచ్చినట్లు భావిస్తున్నారు.
ఎందుకంటే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న ‘దురంధర్-2’తో నేరుగా పోటీ పడుతూ.. ఇంకో వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రిలీజవుతుండగా.. ఇంత పెట్టుబడి పెట్టడం అన్నది మామూలు రిస్క్ కాదు. సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. అంత డబ్బులు పెడితే వర్కవుట్ కాదు. ‘కేెజీఎఫ్-2’ సైతం వంద కోట్ల షేర్ రాబట్టని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
‘టాక్సిక్’ హక్కులు ఎంత పలికాయి అన్నది పక్కన పెడితే.. మార్చి చివరి వారంలో థియేటర్ల కోసం గొడవ తప్పేలా లేదు. 19న ‘దురంధర్-2’, ‘టాక్సిక్’ సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపకం సమానంగా ఉండొచ్చు. దిల్ రాజుకు థియేటర్ల మీద ఉన్న పట్టు వల్ల ‘టాక్సిక్’కే ఎక్కువ స్క్రీన్లు కూడా దక్కొచ్చు. కానీ తర్వాతి వారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ టైంకి ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న.
దిల్ రాజు సంస్థకు పోటీగా మారిన మైత్రీ మూవీ మేకర్స్ పవన్ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. డిస్ట్రిబ్యూషన్లో కొన్నేళ్ల నుంచి మైత్రీ వాళ్లతో ఎస్వీసీ వాళ్లకు ఘర్షణ నడుస్తోంది.
సంక్రాంతికి ఆ సంస్థ రిలీజ్ చేసిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి కూడా కొంత ఇబ్బంది తప్పలేదు. ప్రభాస్ సినిమా అయినా సరే.. స్క్రీన్ల సమస్య తలెత్తింది.
ఈ నేపథ్యంలో పవన్ సినిమాకు నైజాం, వైజాగ్ ఏరియాల్లో కోరుకున్నన్ని స్క్రీన్లు లభిస్తాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యమైన స్క్రీన్లు రాజు సంస్థ చేతుల్లోనే ఉంటాయి. వాటిలో ‘టాక్సిక్’నే రెండో వారం కూడా కొనసాగిస్తే పవన్ సినిమాకు ఇబ్బంది అవుతుంది.
మైత్రీ వాళ్ల సంగతి పక్కన పెడితే.. విషయం పవన్ వరకు వెళ్తే దిల్ రాజుకు తలనొప్పి తప్పదు. పవన్‌తో సినిమా చేయాలన్న కలను ‘వకీల్ సాబ్’తో నెరవేర్చుకున్న రాజు.. మళ్లీ పవర్ స్టార్‌తో ఇంకో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రాజు వల్ల ‘ఉస్తాద్’కు థియేటర్ల సమస్య తలెత్తితే.. పవన్ దగ్గర చెడ్డపేరు వచ్చి, ఆ అవకాశం దూరమవుతుంది. కాబట్టి ఈసారికి పవన్ రూపంలో మైత్రీ వారికి రక్షణ కవచం ఉన్నట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
