దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు కూడా భారీ విజ‌యం సాధించినప్ప‌టికీ.. దురంధ‌ర్ సాధించిన విజ‌యం అసామాన్యం. ఏకంగా రూ.1350 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ప్ర‌కంప‌న‌లు రేపిందా చిత్రం. ఒక్క భాష‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు నెల‌కొల్పింది.

రెండు నెల‌ల పాటు బాక్సాఫీస్‌ను ఏలిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చింది. నెట్‌ఫ్లిక్స్ గురువారం అర్ధ‌రాత్రి నుంచే దురంధ‌ర్‌ను స్ట్రీమ్ చేస్తోంది. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో దురంధ‌ర్ ట్రెండ్ అవుతోంది. దాంతో పాటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా సైతం ట్రెండింగ్‌లోకి రావ‌డం విశేషం. అందుక్కార‌ణం.. ఒక పాత పాటను రీమిక్స్ చేస్తూ రూపొందిన‌ దురంధ‌ర్ టైటిల్ సాంగ్‌ను ప‌దేళ్ల కింద‌టే స‌ర్దార్ సినిమాలో ప‌వ‌న్ అండ్ టీం వాడ‌డ‌మే.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ క్లైమాక్స్ ముంగిట పాట‌ల మెడ్లీ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో వివిధ భాష‌ల పాత పాట‌ల‌కు ప‌వ‌న్‌తో పాటు రౌడీలు డ్యాన్స్ చేస్తారు. అందులో ఉప‌యోగించిన హిందీ పాట‌నే దురంధ‌ర్ టైటిల్ సాంగ్ కోసం రీమిక్స్ చేశారు. దురంధ‌ర్ హిందీ రిలీజ్ సంద‌ర్భంగా ఆ పాట ట్రెండింగ్‌లోకి రాగా.. ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ పాట‌ను కూడా సోష‌ల్ మీడియాలో తిప్పుతున్నారు మ‌న నెటిజ‌న్లు.

అనూహ్యంగా ఇలా ఒక డిజాస్ట‌ర్ సినిమా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ పాటల టేస్ట్ గురించి కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. పాత పాట‌ల‌ను రీమిక్స్ చేయ‌డం.. సంద‌ర్భానుసారం వాడుకోవ‌డం.. హిందీ సాంగ్స్‌ను ఉప‌యోగించ‌డం.. ప‌వ‌న్ కెరీర్ ఆరంభం నుంచి చేస్తూనే ఉన్నాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లో ఆ పాట‌ల వాడ‌కం కూడా ప‌వన్ ఐడియానే అంటారు టీం స‌భ్యులు. గ‌బ్బ‌ర్ సింగ్‌కు కొన‌సాగిపుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.