కోన వెంకట్.. రౌడీ బేబీ


ఒకప్పటి ఫేమస్ రైటర్ కోన వెంకట్.. కొన్నేళ్లుగా ప్రొడక్షన్‌కే పరిమితం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడో కానీ పెన్ను పట్టుకోవట్లేదు. ప్రస్తుతం వైజాగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణతో డబ్బులు పెట్టించి తనే ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ కొన్నేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నారాయన. కొన్నిసార్లు వేరే సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటున్నారు. కొంత విరామం తర్వాత ఆయన కోన ఫిలిం కార్పొరేషన్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.

యువ కథానాయకుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డితో ‘రౌడీ బేబీ’ అనే సినిమాను మొదలుపెట్టారు. ఎంవీవీ సత్యనారాయణనే దీనికి నిర్మాత. కోన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. రచనలో ఆయన పాత్ర ఏమీ ఉన్నట్లుగా కనిపించడం లేదు.

ఒకప్పుడు మంచి కామెడీ ఎంటర్టైనర్లు అందించిన నాగేశ్వరరెడ్డికి కొన్నేళ్లుగా కలిసి రావడం లేదు. చివరగా ఆయన సందీప్ కిషన్‌నే హీరోగా పెట్టి ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తీశాడు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మళ్లీ ఇప్పుడు మరో కామెడీ కథతో ‘రౌడీ బేబీ’ని పట్టాలెక్కించాడు. ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘మారి-2’లో రౌడీ బేబీ పాట తెలుగులోనూ సూపర్ హిట్టే. రౌడీ బేబీ అనే మాట సూపర్ పాపులర్. ఆ టైటిల్‌ పెట్టి తెలుగులో కామెడీ సినిమా తీయడం విశేషమే. విశాఖపట్నంలో ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది కూడా. అతను ఇప్పటికే ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాను పూర్తి చేసేశాడు.

ఈ చిత్రంలో కథానాయిక ఎవరో ఇంకా తేలలేదు. ఇండీ సాంగ్ ‘ఊరెళ్లి పోతా మామా’తో మంచి పేరు సంపాదించి ఆ తర్వాత సినిమాల్లో కొన్ని పాటలు పాడిన ‘చౌరస్తా’ రామ్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.