ఇది డిజిటల్ బ్లాక్‌బస్టర్

కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో గత ఏడెనిమిది నెలల్లో పదుల సంఖ్యలో కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. ఐతే వాటిలో ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకున్న సినిమాలు చాలా చాలా తక్కువ. మామూలుగానే సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటే.. ఓటీటీ సినిమాల్లో ఈ శాతం మరీ తగ్గిపోయింది. ఓటీటీల్లో రిలీజైన తెలుగు సినిమాల్లో యునానమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అంటే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మాత్రమే.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, మిడిల్ క్లాస్ మెలోడీస్, భానుమతి రామకృష్ణ లాంటి చిత్రాలు ఉన్నంతలో మంచి స్పందనే తెచ్చుకున్నాయి. మిగతా సినిమాల గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. హిందీ విషయానికి వస్తే దిల్ బేచారా, శకుంతలా దేవి, రాత్ అకేలీ హై, ది సూటబుల్ బాయ్ లాంటి సినిమాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఐతే ఇండియాలో మొత్తంగా ఓటీటీ సినిమాల్లో ఏమాత్రం నెగెటివ్ రిమార్క్ లేకుండా అందరి ఆమోదం, ప్రశంసలు తెచ్చుకున్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’నే.

ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ సూర్య సినిమా తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. ఈ భాషల వాళ్లు ఈ చిత్రాన్ని విరగబడి చూశారు. చాలా మంచి రివ్యూలు, సోషల్ మీడియా టాక్‌తో చర్చనీయాంశంగా మారింది ‘ఆకాశం నీ హద్దురా’. ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు సైతం సబ్‌టైటిల్స్‌తో బాగానే చూశారు. అమేజాన్ చరిత్రలోనే ఇండియాలో అత్యధిక మంది చూసిన చిత్రాల్లో ‘ఆకాశం నీహద్దురా’ ఒకటి అట. ఈ జాబితాలో ఇదే నంబర్ వన్ సినిమా అయినా ఆశ్చర్యం లేదేమో.

ఈ ఏడాదికి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ రిలీజ్ చేసిన టాప్ ట్రెండింగ్ టాపిక్స్ తీస్తే అందులో ‘ఆకాశం నీ హద్దురా’ టాప్‌లో కనిపిస్తోంది. గూగుల్, ట్విట్టర్ జాబితాలు చూస్తే ఈ సినిమా ఎంతగా చర్చనీయాంశమైందో, ప్రేక్షకుల దృష్టిని ఎంతగా ఆకర్షించిందో అర్థమవుతుంది. సూర్య ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అయినపుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. తప్పుబట్టారు. కానీ అతను చేసిన సాహసానికి గొప్ప స్పందనే లభించింది.