ఎఫ్-3.. అంత వీజీ కాదు బాసూ

టాలీవుడ్లో సీక్వెల్స్ చరిత్ర చూస్తే సక్సెస్ రేట్ దారుణాతి దారుణమని అర్థమవుతుంది. బాలీవుడ్లో మాదిరి సీక్వెల్స్‌ను జనరంజకంగా తీర్చిదిద్దడంలో మన వాళ్లు తడబడుతుంటారు. తొలి సినిమా స్థాయిలో సీక్వెల్ హిట్టయిన దాఖలాలు తెలుగులో దాదాపు కనిపించవు. అయినా సరే.. ఇప్పుడు ఇంకో సీక్వెల్ పట్టాలెక్కింది. గత ఏఢాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్-2’కు కొనసాగింపుగా ‘ఎఫ్-3’ని లైన్లో పెట్టింది అదే టీం. కానీ ఇంతకుముందు వచ్చిన సీక్వెల్స్ లాగే దీనికి కూడా సవాళ్లు ముందున్నాయి.

గత ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్-2’ రిలీజయ్యే ముందు దానిపై పెద్దగా అంచనాలు లేవు. అందరి దృష్టీ ‘యన్టీఆర్: కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల మీదే నిలిచింది. కానీ ఆ రెండు సినిమాలూ నిరాశకు గురి చేయగా.. లేటుగా వచ్చిన ‘ఎఫ్-3’ మీద పడిపోయారు ప్రేక్షకులందరూ. సంక్రాంతి సమయానికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలా ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చేశాయి ఆ సమయంలో. పరిమిత బడ్జెట్లో తెరకెక్కడం, తక్కువ రేట్లకు సినిమాను అమ్మడం కూడా ప్లస్ అయింది.

ఐతే ‘ఎఫ్-3’ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నం. దీనిపై ముందు నుంచే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రేక్షకులు పతాక స్థాయి వినోదాన్ని ఆశిస్తున్నారు. సీక్వెల్స్ అన్నింటికీ కూడా ఈ అంచనాలే శాపమయ్యాయి. ఏమాత్రం ఆ అంచనాలు తగ్గినా సినిమాను తిరస్కరించేస్తున్నారు ప్రేక్షకులు. ‘ఎఫ్-2’లో ద్వితీయార్దం తేలిపోయినా సరే.. ప్రథమార్ధంతోనే సినిమా పాస్ అయిపోయింది. సీక్వెల్ విషయంలో ఇలాంటి తేడాలుంటే నడవదు.

అనిల్ రావిపూడి ‘ఎఫ్-2’ తర్వాత తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో కామెడీ అనుకున్నంతగా పండకపోవడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో ‘ఎఫ్-3’లో అతను అనుకున్నంతగా నవ్విచగలడా అన్న సందేహాలున్నాయి. మరోవైపు ‘ఎఫ్-2’ బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో ఈసారి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లూ పారితోషకాలు పెంచేశారు. అంతే కాక ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగబోతోంది. దీంతో సినిమా బడ్జెట్ పెరిగి, అందుకు తగ్గట్లే అమ్మకాలు కూడా జరుగుతాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ‘ఎఫ్-3’ని అంచనాలకు తగ్గట్లు నిలబెట్టడం అంత తేలిక కాదు. చూద్దాం అనిల్ అండ్ టీం ఏం చేస్తుందో?