దాదాపు మూడేళ్ల కిందట వచ్చిన అనుష్క సినిమా ‘భాగమతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. అంతకుముందు అనుష్క సినిమానే అయిన ‘రుద్రమదేవి’ కూడా భారీ వసూళ్లే రాబట్టింది. కానీ దానికి అల్లు అర్జున్ స్టార్ పవర్ కూడా తోడైంది.
అందులో రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్ లాంటి ఇతర భారీ తారాగణం కూడా ఉంది. పైగా అది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. కానీ ‘భాగమతి’ దానికి పూర్తి భిన్నమైన సినిమా. కొంచెం అటు అటు అయితే డిజాస్టర్ అయ్యే కథాంశంతో తెరకెక్కిందీ చిత్రం. ఆ సినిమాను తన భుజాలపై మోసిన అనుష్క అది పెద్ద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ విషయంలో మిగతా హీరోయిన్లకు, అనుష్కకు ఉన్న తేడా ఏంటో ఈ సినిమా చూపించింది.
‘భాగమతి’గా అనుష్కను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం అనడానికి ఇప్పుడు దాని హిందీ వెర్షన్ ‘దుర్గామతి’కి వస్తున్న స్పందనే రుజువు. ఒరిజినల్ రూపొందించిన అశోకే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేశాడు. షాట్ టు షాట్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అతను దించేశాడు. నటీనటులు మాత్రమే మారారు. డైలాగులు కూడా అనువాదం చేసినట్లే ఉన్నాయి తప్ప మార్పేమీ లేదు. కొద్దిగా లొకేషన్లు, సెట్టింగ్స్ మాత్రం మార్చారు. కానీ ఒరిజినల్లో ఉన్న ఫీల్ ఈ సినిమా ఇవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం అనుష్క పండించినట్లు భాగమతి పాత్రను భూమి పడ్నేకర్ పండించలేకపోవడమే. ట్రైలర్ చూసినపుడే అనుష్క ముందు ఆమె తేలిపోయింది. ఆమెను అనుష్క అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు.
‘దుర్గామతి’ డిజాస్టర్ కావడం ఖాయం అంటూ అప్పుడే తీర్పిచ్చేశారు. ఇప్పుడు సినిమా చూసిన వాళ్లందరూ పెదవి విరుస్తున్నారు. లీడ్ రోలే సినిమాకు పెద్ద మైనస్ అనేస్తున్నారు. హిందీ ప్రేక్షకులకు ఈ కథ, సినిమా పెద్దగా రుచించలేదు. ఒరిజినల్ చూసిన వాళ్లకైతే ‘దుర్గామతి’ మరీ పేలవంగా అనిపిస్తోంది. దీన్ని బట్టి ఒక పాత్రకు ఆర్టిస్టు ఎంపిక అనేది చాలా కీలకం అనే విషయం స్పష్టమవుతోంది. ఏ దీపికా పదుకొనే లాంటి వాళ్లో ఈ పాత్ర చేస్తే ప్రేక్షకుల ఫీలింగ్ మరోలా ఉండేదేమో.