‘ప్రభాస్ పెళ్లి’తో ప‌బ్లిక్ ప‌ల్స్ పట్టేసిన పొలిశెట్టి

టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు ప్ర‌భాస్. కానీ ఎంత‌కీ త‌న పెళ్లి కావ‌డం లేదు. కృష్ణంరాజు జీవించి ఉండ‌గానే ప్ర‌భాస్ పెళ్లి చూడాల‌ని చాలా ఆశ‌ప‌డ్డారు. కానీ అది సాధ్య‌ప‌డలేదు. అలా అని ప్ర‌భాస్‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా.. ఇంట్లో ఆ ప్ర‌య‌త్నాలు ఆపేశారా అంటే అదేమీ లేదు. గ‌తంలో కృష్ణంరాజు, ఇప్పుడు ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌లాదేవి ప్ర‌భాస్ పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

మ‌రి యంగ్ రెబ‌ల్ స్టార్ ఎప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతాడో చూడాలి. ఆలోపు ప్ర‌భాస్ వివాహం చ‌ర్చోప చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప్ర‌భాస్ పెళ్లి టాపిక్ నేప‌థ్యంలో గ‌తంలో ఒక సినిమా కూడా రావ‌డం గ‌మ‌నార్హం. ఏఐ పుణ్య‌మా అని ఈ మ‌ధ్య ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగిపోయిన‌ట్లు వీడియోలు కూడా క్రియేట్ చేసి వ‌దులుతున్నారు. మ‌రోవైపు టాలీవుడ్ సెల‌బ్రెటీలు స‌ర‌దాగా ప్ర‌భాస్ వివాహం గురించి త‌మ సినిమాల ప్ర‌మోష‌నల్ ఈవెంట్ల‌లో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటారు.

తాజాగా ప్ర‌భాస్‌కు స‌న్నిహితుడైన యువ క‌థానాయ‌కుడు న‌వీన్ పొలిశెట్టి.. త‌న పెళ్లి గురించి అడిగితే ప్ర‌భాస్ పెళ్లితో ముడిపెట్టేశాడు. సంక్రాంతికి విడుద‌ల కాబోతున్న త‌న కొత్త చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాజాగా మీడియాను క‌లిశాడు న‌వీన్ పొలిశెట్టి. అక్క‌డ అత‌డికి పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదురైంది. దానికి అత‌ను బ‌దులిస్తూ.. త‌న‌కెంతో ఇష్ట‌మైన ప్ర‌భాస్ అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఆ వెంట‌నే త‌న వివాహం కూడా జ‌రిగిపోతుంద‌ని సెల‌విచ్చాడు.

ప్ర‌భాస్ పెళ్లి అయిన 24 గంట‌ల‌కే తన పెళ్లి కూడా అయిపోతుంద‌ని పేర్కొన్నాడు. ఈ స‌మాధానం విని.. న‌వీన్ భ‌లే తెలివైనోడే, త‌న‌కు ప‌బ్లిక్ ప‌ల్స్ బాగా తెలుసే అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు సంక్రాంతికి జ‌రిగే కోడి పందేల్లో పాల్గొంటారా అని అడిగితే.. త‌న‌కు వాటి మీద ఆస‌క్తి లేద‌న్నాడు న‌వీన్. దీని గురించి రెట్టించి ప్ర‌శ్న‌లు అడిగితే.. థంబ్ నైల్స్ కోసం వ‌చ్చారా అంటూ స‌ర‌దాగా ప్ర‌శ్నించాడు న‌వీన్. తాను అస‌లు కోడి కూర తిన‌న‌ని.. తాను వెజిటేరియ‌న్ అని.. దీని మీద థంబ్ నైల్స్ వేయాల‌ని అత‌ను కోరాడు.