నారప్ప వ‌స్తున్నాడ‌హో..


టాలీవుడ్లో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఎగ్జైటింగ్ సినిమాల్లో నార‌ప్ప ఒక‌టి. విక్ట‌రీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో షూటింగ్ మొద‌లుపెట్ట‌డానికి ముందే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది చిత్ర బృందం. ఆ త‌ర్వాత సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. అభిమానుల‌తో ఏ విశేషాన్నీ పంచుకున్న‌ది లేదు. దీనికి క‌రోనానే కార‌ణం.

ఐతే క‌రోనా బ్రేక్ త‌ర్వాత ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పునఃప్రారంభించి చ‌క‌చ‌కా సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉంది శ్రీకాంత్ టీం. ఇంత‌లో సినిమా టీజ‌ర్‌కు కూడా రంగం సిద్ధం చేసింది. దీని గురించి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చ‌క్క‌టి పోస్ట‌ర్ ద్వారా స‌మాచారం ఇచ్చింది.

నార‌ప్ప టీజ‌ర్ రాత్రి 8 గంట‌ల‌కు విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రంలో మ‌ధ్య వ‌య‌స్కుడైన రైతు బిడ్డ‌గా క‌నిపించ‌నున్న‌ వెంకీ.. ఒక మేక‌పిల్ల‌ను చేతుల్లోకి తీసుకుని ప్రేమ‌గా చూస్తున్న చ‌క్క‌టి పోస్ట‌ర్‌తో టీజ‌ర్ అప్‌డేట్ ఇచ్చారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన లుక్స్‌లాగే ఇది కూడా ఆక‌ట్టుకుంటోంది.

ఈ చిత్రం త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ అసుర‌న్‌కు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఐతే రీమేక్ అన‌గానే ఒక‌ర‌క‌మైన అనాస‌క్తి జ‌నాల్లో క‌నిపించింది. పైగా అసుర‌న్‌ను అమేజాన్ ప్రైమ్‌లో మ‌న వాళ్లు బాగానే చూశారు. కానీ వెంకీని నార‌ప్ప‌గా చూశాక జ‌నాల అభిప్రాయం మారింది. ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగింది. పైగా శ్రీకాంత్ అడ్డాల లాంటి క్లాస్ డైరెక్ట‌ర్ ఈ వ‌యొలెంట్ మూవీని ఎలా ప్రెజెంట్ చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.