సినిమా రిలీజైందంటే రిలీజైంది


తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యే థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. ఐతే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న నేపథ్యంలో పేరున్న కొత్త సినిమాలేవీ ఇప్పుడే విడుదలయ్యే సంకేతాలు కనిపించడం లేదు. తొలి వారం హాలీవుడ్ మూవీ ‘టెనెట్’ కొంత మేర థియేటర్లను ఆకట్టుకుంది. జనాలు అంతో ఇంతో థియేటర్లకు కదిలొచ్చింది ఈ సినిమా చూడ్డానికే.

తెలుగుతో పాటు హిందీ సినిమాలు పాతవి కూడా కొన్ని ప్రదర్శించారు కానీ.. వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కాగా లాక్ డౌన్ తర్వాత ఎట్టకేలకు ఓ కొత్త తెలుగు సినిమాను ఈ శుక్రవారం థియేటర్లలోకి వదిలారు. కానీ ఆ సినిమా రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియట్లేదు. వాళ్లకు దానిపై ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. ఇంతకీ ఆ సినిమా ఏదంటారా.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘కరోనా వైరస్’.

లాక్ డౌన్ తర్వాత రిలీజవుతున్న తొలి తెలుగు సినిమా అంటూ వర్మ ఘనంగా ప్రకటించి ‘కరోనా వైరస్’ను ఈ రోజే థియేటర్లలోకి దించాడు. కానీ దానికి మినిమం రెస్పాన్స్ కనిపించడం లేదు. రిలీజ్ చేసిందే తక్కువ థియేటర్లలో. అవి కూడా పూర్తి ఖాళీగా కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో ‘కరోనా వైరస్’ థియేటర్లలో బుకింగ్స్ చూస్తే ఎక్కడా డబుల్ డిజిట్లో టికెట్లు తెగలేదు. కొన్ని స్క్రీన్లలో అయితే ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి జనాలకు ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్మకు కూడా సినిమాపై పెద్దగా ఆశల్లేనట్లున్నాయి. ట్విట్టర్లో తన ఊకదంపుడు ప్రచారం కూడా ఆపేశాడు. రిలీజ్ గురించి అసలేమాత్రం హడావుడి చేయట్లేదు.

వర్మ ఇదే నెలలో రిలీజ్ చేయబోతున్న మర్డర్, ది ఎన్‌కౌంటర్ సినిమాల పరిస్థితేంటో చూడాలి మరి. ఈ రోజే రిలీజైన హిందీ సినిమా ‘ఇందు కీ జవానీ’కి కూడా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రమోషన్లు గట్టిగా చేసినా జనాలు ఈ సినిమా చూడ్డానికి అంతగా ఆసక్తి చూపించట్లేదని బుకింగ్స్‌ను బట్టి అర్థమవుతోంది.