ర‌కుల్ ప్రీత్‌కిది పెద్ద విజ‌య‌మే

కొన్ని నెల‌ల కింద‌ట బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసు అనేక మ‌లుపులు తిరిగి సినీ ప‌రిశ్ర‌మ‌లో డ్రగ్ రాకెట్ గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు రావ‌డం తెలిసిన సంగ‌తే. సుశాంత్ మాజీ ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి ఈ కేసులో కేంద్ర బిందువులాగా క‌నిపించింది.

ఆమె స్నేహితురాలైన ర‌కుల్ ప్రీత్ సింగ్ సైతం ఆ స‌మ‌యంలో మీడియాకు టార్గెట్ అయింది. ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచార‌ణ‌కు పిల‌వ‌డంతో మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు షికారు చేశాయి. ర‌కుల్ పెద్ద డ్ర‌గ్ అడిక్ట్ అన్న‌ట్లుగా ప్రొజెక్ట్ చేశారు. క‌ట్ చేస్తే గ‌తంలో టాలీవుడ్లో డ్ర‌గ్స్ కేసులాగే ఇందులోనూ పెద్ద‌గా అధికారులు తేల్చిందేమీ లేదు. సినిమా వాళ్లెవ్వ‌రికీ పెద్ద ఇబ్బంది రాలేదు. ర‌కుల్ ప్రీత్ సైతం ఈ కేసులో పెద్ద‌గా ఇబ్బంది ప‌డ్డ‌ట్లు క‌నిపించ‌లేదు.

క‌ట్ చేస్తే ర‌కుల్ ప్రీత్ త‌న‌పై దుష్ప్ర‌చారం చేసిన మీడియా సంగ‌తేంటో తేల్చాల‌నుకుంది. ఆ ల‌క్ష్యం నెర‌వేర్చుకుంది కూడా. డ్ర‌గ్స్ కేసులోకి త‌న పేరు లాగి దుష్ప్ర‌చారం చేసిన మీడియా సంస్థ‌ల‌పై ఆమె చేసిన న్యాయ పోరాటం ఫ‌లించింది. న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ (ఎన్‌బీఎస్ఏ)., వాస్త‌వాలు నిర్ధారించ‌కుండా ర‌కుల్ మీద త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేసిన జీ గ్రూప్ ఛానెళ్లు జీ న్యూస్, జీ24 తాజ్, జీ హిందుస్థానిల‌కు అక్షింత‌లు వేసింది. ర‌కుల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆ సంస్థ‌ల‌ను ఆదేశించింది. ఇంకా టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఆజ్ త‌క్, ఇండియా టీవీ త‌దిత‌ర ఛానెళ్ల‌ను కూడా ఎన్‌బీఎస్ఏ హెచ్చ‌రించింది.

ర‌కుల్‌కు వ్య‌తిరేకంగా పెట్టిన అన్ని ర‌కాల వార్త‌లనూ తొల‌గించాల‌ని వాటిని ఆదేశించింది. డ్ర‌గ్స్ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి తోడు.. త‌న‌పై దుష్ప్ర‌చారం చేసిన ఛానెళ్ల‌కు అక్షింత‌లు వేయించ‌డం అంటే ర‌కుల్‌కు ఇది పెద్ద విజ‌యంగానే లెక్క‌.