ఓయ్ దర్శకుడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..


తొలి సినిమా ఓ దర్శకుడి కెరీర్‌కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఫలితాన్ని బట్టి రాత్రికి రాత్రి అతడి జీవితం మారిపోతుంటుంది. ఆ సినిమా సక్సెస్ అయితే.. వెంటనే నిర్మాతలు లైన్లోకి వచ్చేస్తారు. తేడా కొడితే పట్టించుకునే వాడుండడు. పుష్కరం కిందట ‘ఓయ్’ సినిమాతో ప్రామిసింగ్ డైరెక్టర్ అవుతాడన్న అంచనాలు కలిగించాడు ఆనంద్ రంగా. ఆ సినిమాకు విడుదల ముంగిట మంచి బజ్ వచ్చింది. పాటలు సూపర్ హిట్టయ్యాయి. ప్రోమోలు ఆకర్షణీయంగా కనిపించాయి. కానీ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. సినిమా థియేటర్లలో నిలబడలేదు. దీంతో ఆనంద్ కెరీర్‌కు ఆరంభంలోనే బ్రేక్ పడిపోయింది.

దీని తర్వాత ‘పొగ’ అని నవదీప్ హీరోగా ఒక సినిమా చేశాడు కానీ.. అది థియేటర్లలోకే రాలేదు. ఇంకా ఏవో చిన్నా చితకా ప్రయత్నాలు చేసిన ఆనంద్.. టాలీవుడ్లో తన ముద్రను వేయలేకపోయాడు. లైమ్ లైట్లో లేకుండా పోయాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ఆనంద్ రంగా మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. కాకపోతే ఈసారి అతను తీసింది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దాని పేరు.. షూటౌట్ అట్ ఆలేర్. పేరుకు వెబ్ సిరీసే కానీ కంటెంట్, ఆర్టిస్టుల పరంగా చూస్తే సినిమా స్థాయికి తగ్గట్లే ఉంది ‘షూటౌట్ అట్ ఆలేర్’. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. తాజాగా దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అదే పనిగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని వాళ్లను కిరాతకంగా చంపడం మొదలుపెట్టిన అక్తర్ అనే కరడుగట్టిన క్రిమినల్‌ను కట్టడి చేయడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో నడిచే సిరీస్ ఇది.

అక్తర్ పాత్రలో ఎవరో కొత్త నటుడు చేశాడు కానీ.. ఆ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపిస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులుగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కనిపిస్తున్నారు. ఈ సిరీస్ మోస్ట్ వయొలెంట్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో మాదిరి ఘాటైన శృంగార సన్నివేశాలకు కూడా ఢోకా లేదు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమ్ కానుంది.