ఆ హీరో దగ్గరికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు

ఒక సినిమా మీద ఇండస్ట్రీ భవిష్యత్ ఆధారపడి ఉండటం అన్నది అరుదైన విషయం. కోలీవుడ్‌లో ‘మాస్టర్’ సినిమా ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉంది. తమిళంలో ప్రస్తుతం బిగ్టెస్ట్ స్టార్ అనదగ్గ విజయ్ నటించిన చిత్రమిది. కరోనా లేకుంటే ఈ ఏడాది వేసవిలోనే ఈ సినిమా విడుదలయ్యేది. వైరస్ కారణంగా వాయిదా పడి.. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ప్రేక్షకుల ముందుకొద్దామని చూస్తోందీ చిత్రం. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి థియేటర్లు. సంక్రాంతికి ఏమైనా 100 పర్సంట్ ఆక్యుపెన్సీ సాధ్యమవుతుందేమో అని చూశారు. కానీ ఇప్పటిదాకా అలాంటి సంకేతాలేమీ రాలేదు.

దీంతో ‘మాస్టర్’ను వేసవికి వేద్దామని చూస్తున్నారు నిర్మాతలు. ఇది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రుచించట్లేదు. మళ్లీ థియేటర్లు ఊపందుకోవాలంటే ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రం విడుదల కావాలని.. అది కాకుండా వేరే ఏ సినిమాలు వచ్చినా కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి మారదని.. ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడరని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పేరుమోసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి విజయ్‌ను కలిశారు. ఎలాగైనా ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని.. అది ఇండస్ట్రీ మీద సానుకూల ప్రభావం చూపుతుందని, వేలాది కుటుంబాలకు మళ్లీ ఉపాధి దొరికి అందరూ బాగు పడతారని వాళ్లు విజయ్ దగ్గర విన్నవించుకున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న విజయ్ నిర్మాతలతో మాట్లాడుతున్నాడట.

తమిళ సినీ పరిశ్రమ తరఫున త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి థియేటర్లలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులివ్వాలని విన్నవించనున్నారట. కేంద్ర ప్రభుత్వానికి కూడా వివిధ సినీ పరిశ్రమల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వెళ్లే అవకాశముంది. ఒకవేళ కొత్త ఏడాదిలో ఇందుకు అవకాశం లభిస్తే ‘మాస్టర్’ కచ్చితంగా సంక్రాంతికి సందడి చేసే అవకాశముంది.