శర్వా నుంచి ఇది వస్తే… అది రాదా?

మూడేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క రిలీజ్‌తో పలకరించాడు యువ కథానాయకుడు శర్వానంద్. ఆ చిత్రమే.. మనమే. అది కూడా నిరాశపరిచింది. దీంతో ప్రేక్షకులు నెమ్మదిగా శర్వాను మరిచిపోతున్న పరిస్థితి. కానీ అతను ఏడాది వ్యవధిలో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. అవే.. బైకర్, నారి నారి నడుమ మురారి, భోగి. 

వీటిలో ముందుగా వార్తల్లో నిలిచింది.. నారి నారి నడుమ మురారి. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. శర్వా నెక్స్ట్ రిలీజ్ అదే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘బైకర్’ రేసులో ముందుకు వచ్చేసింది. ఆ చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేయబోతున్నట్లు తాజాగా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ప్రకటించారు.

మరి 40 రోజుల వ్యవధిలో నిజంగా శర్వా నుంచి రెండు సినిమాలు రిలీజవుతాయా అన్నది ప్రశ్న. కానీ వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే చెప్పిన డేటు‌కు విడుదలవుతుందని సమాచారం. ‘బైకర్’ అనుకున్నట్లే డిసెంబరు 6న వచ్చేస్తే.. సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ ఉండదు. సంక్రాంతికి ఆ సినిమా కన్ఫమ్ అంటే.. ‘బైకర్’ చెప్పిన డేటు‌కు రాకపోవచ్చు. ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రంతో ‘బైకర్’ పోటీ పడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. చాలా ఏళ్లుగా విజయం లేక మార్కెట్ దెబ్బ తిన్న స్థితిలో శర్వాకు ఇలాంటి పోటీ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

కానీ ‘బైకర్’ మీద అతను చాలా నమ్మకంతో ఉన్నాడు. పైగా ‘అఖండ-2’తో పోలిస్తే ఇది పూర్తి భిన్నమైన సినిమా కావడంతో దీని ప్రేక్షకులు దీనికి ఉంటారని టీం నమ్ముతోంది. కాబట్టి ‘అఖండ-2’తో పోటీ పడి గెలవగలమనే భావిస్తున్నారు. ‘బైకర్’ పక్కాగా ఆ రోజు రిలీజైతే.. ‘నారి నారి నడుమ మురారి’ ఫిబ్రవరికి వెళ్లబోతున్నట్లే. ఎలాగూ సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉండడంతో ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. సినిమా కూడా ఆ టైంకి రెడీ అవుతుందా అనే సందేహాలూ ఉన్నాయి.