ఇప్పుడు ఇండస్ట్రీలో తేజ సజ్జ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏడేళ్ల క్రితం సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఓ బేబీలో సపోర్టింగ్ వేషంతో ఎంట్రీ ఇచ్చిన తేజ తర్వాత జాంబీ రెడ్డితో మంచి విజయం అందుకున్నాడు. దీని వల్ల ప్రత్యేకంగా ఇమేజ్ రాలేదు కానీ అవకాశాలు తెచ్చుకోవడానికి ప్లాట్ ఫార్మ్ గా ఉపయోగపడింది. దాని దర్శకుడు ప్రశాంత్ వర్మని హనుమాన్ ఆఫర్ ఇచ్చేలా చేసింది. ఇదే తేజ సజ్జ జీవితాన్ని మార్చేసింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్లతో పోటీ పడి గొప్ప విజయాన్ని హనుమాన్ అందుకోవడం ఎవరూ ఊహించలేదు. సంక్రాంతి విజేతగా నిలవడం మరో చరిత్ర.
ఇప్పుడు మిరాయ్ తో మరో బ్లాక్ బస్టర్ తేజ సజ్జ ఖాతాలో పడింది. ఓజి సునామిలోనూ మూడో వారం మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేయడం చిన్న విషయం కాదు. నార్త్ అమెరికాలో వరసగా హనుమాన్, మిరాయ్ లతో మూడు మిలియన్ సినిమాలు రెండు అందుకున్న చిన్న వయసు టాలీవుడ్ స్టార్ గా తేజ సజ్జ ఖాతాలో మరో రికార్డు తోడయ్యింది. ఇమేజ్ ఉన్న టయర్ 2 హీరోల వల్ల కూడా అంత సులభంగా సాధ్యం కాని ఫీట్ ఇది. ఇదంతా ఓవర్సీస్ లో తన బ్రాండ్ పెంచుకునేందుకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం జాంబీ రెడ్డి 2 కోసం రెడీ అవుతున్న తేజ సజ్జ దానికి కూడా రెండేళ్లకు పైగా సమయం కేటాయించబోతున్నాడు.
చిన్నప్పుడు ఇంద్ర, గంగోత్రి, యువరాజు, కలిసుందాం రా, వసంతం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ గా మెప్పించిన తేజ సజ్జ ఇప్పుడు చిచ్చర పిడుగై పోయాడు. అయితే విజువల్ గ్రాండియర్స్ మీద ఫోకస్ పెడుతున్న ఈ కుర్రాడు వేర్వేరు జానర్స్ ని ట్రై చేయాల్సి ఉంది. ముఖ్యంగా రామ్ కామ్స్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్, ఎమోషనల్ డ్రామాల వల్ల నటుడిగా తనను తాను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు ఎక్కువ సినిమాలు ఫిల్మోగ్రఫీలో చేరతాయి. తేజ సజ్జ ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది. జాంబీ రెడ్డి విడుదల 2027 సంక్రాంతి అన్నారు కానీ ఇప్పటిదాకా క్యాస్టింగ్, దర్శకుడు లాంటి వివరాలేవీ ఫైనల్ చేయలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates