దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. చివరగా ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తీసి, అప్పట్నుంచి విశ్రాంతిలో ఉన్న ఆయన.. కొన్ని నెలల కిందటే ‘పెళ్ళిసందd’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాఘవేంద్రరావుతో కలిసి ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రం కోసం ఇప్పటికే సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి. దర్శకేంద్రుడు రూపొందించిన బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ ‘పెళ్ళిసందడి’లో శ్రీకాంత్ కథానాయకుడిగా నటించగా.. దాని మోడర్న్ వెర్షన్లో ఆయన తనయుడు రోషన్ హీరోగా ఎంపికయ్యాడు. ఇంకా కథానాయికల సంగతి తేలలేదు.
ఐతే ‘పెళ్ళిసందd’కి దర్శకుడు ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావే తీస్తాడని కొందరు.. లేదు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడని ఇంకొందరు అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో రెండో విషయమే నిజమట. ‘స్టూడెంట్ నంబర్ వన్’కు చేసినట్లే ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడట దర్శకేంద్రుడు. దర్శకత్వ బాధ్యతలు సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
భరణికి నటుడిగా ఎంత పేరుందో రచయితగా అంతే పేరుంది. ఆయన కొన్నేళ్ల కిందట దర్శకుడిగా మారి తీసిన ‘మిథునం’ గొప్ప ప్రశంసలందుకుంది. ఆ తర్వాత ‘భక్త కన్నప్ప’ తీయాలనుకుని ప్రయత్నం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మన సంస్కృతి సంప్రదాయాలపై గొప్ప పట్టున్న భరణి.. పెళ్ళి నేపథ్యంలో సాగే సినిమాను బాగా తీయగలరని ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారట. కాకపోతే తన అభిరుచి కూడా తోడైతే సినిమాకు మంచి జరుగుతుందని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates